(1 దీప్తి(24)) (2 కోరుట్ల బస్టాండ్ సీసీ ఫుటేజీలో యువకుడితో చందన)
కోరుట్ల/రాయికల్: ‘సోమవారం రాత్రి ఆ ఇంట్లో అక్కాచెల్లెళ్లు మాత్రమే ఉన్నారు. తెల్లారేసరికి అక్క చనిపోయి సోఫాలో పడి ఉంది. ఇంటి బయట తలుపునకు గొల్లెం పెట్టి చెల్లి ప్రియుడితో కలిసి పరారైంది’. ఇంట్లోని కిచెన్‌లో ఓడ్కా, బ్రీజర్ బాటిళ్లు ఉన్నాయి. అసలు ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగి ఉంటుంది..? అక్క చనిపోవడానికి చెల్లెలే కారణమా..? ప్రియుడితో కలిసి చెల్లె వెళ్లిపోతుంటే అక్క అడ్డుకున్న క్రమంలో గొడవ జరిగిందా.. ఈ గొడవలోనే అక్క ప్రాణాలు పోయాయా..? లేదా ఓడ్కాలో అక్కకు మత్తు ఇచ్చి చెల్లెలు గుర్తుతెలియని యువకుడితో కలిసి పరారైందా..? వోడ్కాలో కలిపిన మత్తు మందు డోసు ఎక్కువై అక్క చనిపోయిందా..?!
అనేక అనుమానాలు
కోరుట్లకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బంక దీప్తి మృతి వెనక లెక్కలేని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రకు చెందిన బంక శ్రీనివాస్‌రెడ్డి–మాధవి దంపతులు సుమారు పాతికేళ్లుగా కోరుట్లలోని భీమునిదుబ్బలో స్థిరపడ్డారు. ఇటుకబట్టీ వ్యాపారం చేసుకునే శ్రీనివాస్‌రెడ్డికి కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కుమారుడు బెంగళూర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. పెద్ద కూతురు దీప్తి(24) పుణేలోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్‌ఫ్రం హోం పద్ధతిన ఇంట్లో నుంచి పనిచేస్తోంది. చిన్నకూతురు చందన ఇటీవల బీటెక్ పూర్తి చేసింది. సోమవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి– మాధవి హైదరాబాద్‌లోని బంధువుల గృహాప్రవేశం కార్యక్రమానికి వెళ్లగా దీప్తి, చందన మాత్రమే ఇంట్లో ఉన్నారు. రాత్రి 10 గంటల వరకు తండ్రితో అక్కాచెల్లెళ్లు ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం.
తెల్లారేసరికి..
మంగళవారం ఉదయం శ్రీనివాస్‌రెడ్డి తన కూతుళ్లతో మాట్లాడటానికి ప్రయత్నించగా పెద్ద కూతురు దీప్తి ఫోన్ లిఫ్ట్ కాలేదు. చిన్నకూతురు చందన ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండుమూడు సార్లు ఫోన్‌లో కూతుళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నించిన శ్రీనివాస్‌రెడ్డి చివరికి పక్క ఇంట్లో ఉన్నవారికి ఫోన్ చేశాడు. తమ కూతుళ్లు ఫోన్ ఎత్తడం లేదని చెప్పి, ఓ సారి ఇంటిదాకా వెళ్లి చూడమని కోరాడు. పక్క ఇంట్లో ఉండే ఓ మహిళ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లోకి వెళ్లి చూడగా తలుపు బయట నుంచి గొళ్లెం పెట్టి ఉంది. పిలిస్తే ఎవరూ పలకలేదు. దీంతో తలుపు గొళ్లెం తీసి లోపలికి వెళ్లి చూడగా పెద్ద కూతురు దీప్తి సోఫాలో పడిపోయి ఉంది. చుట్టుపక్కల వారికి విషయం చెప్పగా వారు దీప్తిని పరిశీలించి అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. బంధువులు, పోలీసులకు సమాచారం ఇవ్వగా మెట్‌పల్లి డీఎస్పీ వంగ రవీందర్‌రెడ్డి, సీఐ లక్ష్మీనారాయణ, ఎస్సైలు కిరణ్, చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఆ రాత్రి ఏం జరిగినట్లు..?
సోమవారం ఉదయం తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని బంధువు ఇంట్లో ఫంక్షన్‌కు వెళ్లగా రాత్రి అక్కాచెల్లెల్లు ఇద్దరే ఇంట్లో ఉన్నారు. కిచెన్‌లో వోడ్కా, బ్రీజర్ బాటిళ్లు, వెనిగర్, నిమ్మకాయలు ఉండటంతో రాత్రి వేళ దీప్తి, చందన కలిసి మద్యం సేవించారా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి మద్యం బాటిళ్లు ఎవరు తెచ్చి ఇచ్చారు, ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు ముందుగానే పథకం వేసుకున్న చందన అతడితోనే మద్యం తెప్పించి ముగ్గురు కలిసి మద్యం తీసుకున్నారా..? అన్న విషయంలో స్పష్టత లేదు. దీప్తికి మద్యంలో మత్తు కలిపి తాము పరారయ్యేందుకు పథకం వేశారా..? మత్తు డోసు ఎక్కువ కావడంతో దీప్తి మృతి చెంది ఉంటుందా..? అన్న అనుమానాలున్నాయి. చందన ప్రియుడితో కలిసి వెళ్లిపోయే ప్రయత్నాన్ని దీప్తి అడ్డుకునే క్రమంలో గొడవ జరిగి ఆ గొడవలో తగలరాని చోట దెబ్బతగిలి దీప్తి చనిపోయిందా..? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీప్తి శరీరంపై పెద్దగా గాయాలు కనిపించకపోవడం ప్రశ్నార్థకంగా మారింది.
బస్టాండ్ సీసీ ఫుటేజీలో చందన..
కోరుట్ల బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో మంగళవారం వేకువజామున 5 గంటలకు చందన ఓ యువకుడితో కలిసి ఉన్న వీడియోలను పోలీసులు గుర్తించారు. చందన, మరో యువకుడు లగేజీ తీసుకుని నిజామాబాద్ వైపు వెళ్లే బస్సు ఎక్కినట్లు సీసీ పుటేజీల్లో రికార్డు అయింది. చందన ఫోన్‌కాల్ డేటా ఆధారంగా ఆమె ఓ యువకుడితో గంటల తరబడి ఫోన్ మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మంగళవారం రాత్రి చందన ఫోన్ లొకేషన్ హైదరాబాద్‌లో వస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారని సమాచారం. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోరుట్ల సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment