ఆన్‌లైన్ పెట్టుబడుల కోసం మీటింగ్
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లాలో ఇప్పటికే అధిక వడ్డీ ఇస్తామని నమ్మించి, పెట్టుబడులు పెట్టించి, పలు కంపెనీలు మోసాలకు పాల్పడ్డాయి. వీటిలో ఓ కంపెనీ పేరు మార్చుకొని, మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకొని, వారితో కొడిమ్యాల మండలంలోని ఓ రిసార్ట్‌లో శుక్రవారం రాత్రి సమావేశం నిర్వహించింది. కంపెనీ యజమాన్యం మొదట వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై ఓ 5 నిమిషాలు అవగాహన కల్పించి, తర్వాత ఆన్‌లైన్ పెట్టుబడులపై సూచనలు చేసింది. ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడితే ఇతర కంపెనీల కంటే ఎక్కువ వడ్డీ ఇవ్వడంతోపాటు సెక్యూరిటీ ఇస్తామని హితబోధ చేశారు. కొన్ని కంపెనీలు మూత పడటంతో పెట్టుబడి పెట్టేవారు వెనకడుగు వేస్తున్నారని చాలామంది ఏజెంట్లు అడిగితే.. అలాంటిదేమీ లేదని, మన కంపెనీ పూర్తిస్థాయిలో గ్యారెంటీ ఇస్తుందని, పెట్టుబడి పెట్టేవారిని తీసుకువస్తే.. మీకు విదేశీ టూర్లతోపాటు భారీ ఆఫర్స్ ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశం జరుగుతుందని పోలీసులకు తెలిసినా అక్కడికి వెళ్లలేదని, చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం శనివారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ మోసాలు వెలుగుచూస్తున్న తరుణంలో.. ఇలాంటి మీటింగ్ జరగడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏజెంట్లతో ఓ రిసార్ట్‌లో రహస్య సమావేశం
విషయం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరించిన పోలీసులు!
Comments
Please login to add a commentAdd a comment