మాదక ద్రవ్యాల నియంత్రణకు చర్యలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై కలెక్టరేట్‌లో శనివారం ఏర్పాటు చేసిన నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా సంస్థల్లో యాంటి డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. డ్రగ్స్ వ్యసనపరులను గుర్తించి పునరావాస కేంద్రాల్లో కౌన్సెలింగ్ ఇప్పించాలన్నారు. మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకల డీ– అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేశామని, డ్రగ్స్ బానిసలకు అవసరమైన చికిత్స అందించాలని సూచించారు.
అటవీ శాఖ అధికారులు అటవీ భూముల్లో గంజాయి సాగు వివరాలను పోలీస్ అధికారులకు చేరవేయాలన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో నిల్వలపై ప్రతినెలా తనిఖీ చేయాలని పేర్కొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా ప్రమాణాలు, బర్డ్ ఫ్లూ తదితర అంశాలపై సమీక్షించి పలు సూచనలు చేశారు. ఏసీపీలు కృష్ణ, రమేశ్, డీఎఫ్‌వో శివయ్య, ఆబ్కారీ శాఖ అధికారి మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ వేణు ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment