రాజరాజేశ్వరుని పాలకమండలి ఏర్పాటెప్పుడో..?
● ట్రస్ట్ సభ్యులుగా ఏడుగురి పేర్లు ● ప్రకటించడంలో జాప్యం ● ఈనెల 26 నుంచి శివరాత్రి ఉత్సవాలు
రాయికల్: మండలంలోని కొత్తపేటలోగల రాజరాజేశ్వర నాగాలయంలో ఈనెల 26 నుంచి 28 వరకు మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే మరో 10 రోజుల్లో వేడుక నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటివరకు ఆలయ పాలకమండలిని దేవాదాయ శాఖ ప్రకటించలేదు. దీంతో ఉత్సవాలు ఎలా చేయాలో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక్కడ మూడు రోజులపాటు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవాల కోసం ఎండోమెంట్ అధికారులు పాలకమండలిని ఏర్పాటు చేసి చైర్మన్‌ను ఎన్నుకుంటారు. ఆ పాలకమండలి నేతృత్వంలో మహాశివరాత్రి ఉత్సవాల కోసం మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటారు. రాయికల్, మేడిపల్లి, జగిత్యా ల, కోరుట్ల మండలాల నుంచి వేలాది మంది భక్తులు వచ్చి రాజరాజేశ్వరస్వామిని దర్శనం చేసుకుంటారు. గతంలో 11 మంది సభ్యులతో పాలకమండలి ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం ఏడుగురు ట్రస్ట్ సభ్యులతోపాటు 8 మంది పేర్లతో ఎండోమెంట్ అధికారులకు నివేదించారు. అయినా ఇప్పటివరకు పాలకమండలి పేర్లను ప్రకటించకపోవడం.. మరోవైపు మహాశివరాత్రి ఉత్సవాలు కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాల ఏర్పాట్లకు ఏ విధంగా చేయాలో సతమతమవుతున్నారు. ఈ విషయంపై ఎండోమెంట్ ఏవో విక్రమ్‌ను వివరణ కోరగా ఏడుగురు సభ్యుల పేర్లను నివేదిక పంపించామని, అనుమతి రాగానే ప్రకటిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ స్పందించి రాజరాజేశ్వర నాగాలయ పాలకమండలిని నియమించేలా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment