‘ఆదర్శానికి’ అందని ప్రోత్సాహం
● జంటలకు తప్పని ఎదురు చూపులు ● నాలుగేళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం ● బడ్జెట్ మేరకు అందిస్తామంటున్న అధికారులు
గొల్లపల్లి: సమాజంలో అంతరాలను తగ్గించేందుకు.. ఆదర్శ (కులాంతర) వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. రూ.50 వేల నుంచి ఏకంగా రూ.2.50 లక్షలకు పెంచుతూ 2019 నవంబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. వివా హం చేసుకున్న జంటలకు సకాలంలో అందక ఇ బ్బంది పడుతున్నారు. ప్రోత్సాహకం కోసం నాలు గేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటివరకు 250 దరఖాస్తులు రాగా.. వీరిలో కేవలం 68 జంటలకు మాత్రమే ప్రో త్సాహకం వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంకా 182 మంది ఎదురుచూస్తున్నారు.
అర్హులు వీరే..
● దంపతుల్లో ఒకరు తప్పనిసరిగా షెడ్యూల్ కులానికి చెందిన వారై ఉండాలి. మరొకరు ఇతర కులానికి చెందిన వారై ఉండాలి.
● అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండి ఉండాలి.
● వివాహ చట్టం 1965 కింద నమోదై ఉండాలి.
● కొత్తగా పెళ్‌లైన జంట వార్షికాదాయం రూ.5లక్షలకన్నా తక్కువగా ఉండాలి.
● మొదటి పెళ్లికి మాత్రమే ప్రోత్సాహకం అందుతుంది.
● వివాహమైన ఏడాదిలోపే జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యలయంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తుకు అవసరమైన ధ్రువీకరణపత్రాలు
వేరువేరు కులాలకు చెందిన వారు వివాహం చేసుకుంటే పెళ్లికి సంబంధించిన ఆధారాలతో జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకుడి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికా రుల విచారణలో అర్హులని తేలితే ప్రభుత్వానికి నివేదిక అందిస్తారు. తర్వాత సర్కారు నిధులు మంజూరు చేస్తుంది. వివాహం చేసుకున్న జంట మూడు ఫొటోలు, కులం, వయస్సు ధ్రువీకరణలు, విద్యాసంస్థ నుంచి టీసీ, మార్కుల జాబితా, వివాహం చేయించిన అధికారి ధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారి నుంచి పొందిన ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికెట్, వివాహం చేసుకున్న జంట కలిసి తీసిన బ్యాంక్ అకౌంట్ వివారాలు, వివాహానికి సాక్షులుగా ఉన్నవారి వివరాలు, ఆదాయ ధ్రువీకరణ, ఆధార్, రేషన్ కార్డుతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కల్యాణలక్ష్మీ వైపు మొగ్గు
ప్రస్తుతం కులాంతర వివాహాలు సాధారణమయ్యాయి. గతంలో ఒకే సామాజికవర్గానికి చెందితేనే పెళ్లి సంబంధాలు కులుపుకొనే వారు. ఆ పట్టింపులు క్రమంగా తగ్గిపోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో, అనేక కులాలు ఉన్నప్పటికీ అభిరుచులు, అభిప్రాయాలు కలిస్తే చాలు పెద్దలను ఒప్పించి ఆదర్శ వివాహం చేసుకుంటున్నారు. ఇలా పెళ్లి చేసుకున్నవారికి గతంలో ప్రభుత్వం రూ.50 వేలు ప్రోత్సాహకంగా అందించేది. 2019లో దానిని రూ.2.50లక్షలకు పెంచింది. అయితే ప్రోత్సాహకం మాత్రం అందించకపోవడంతో కల్యాణలక్ష్మీ పథకం వైపు మొగ్గుచూపుతున్నారు.
బడ్జెట్ మేరకు అందిస్తున్నాం
ఆదర్శ వివాహం చేసుకున్న జంటలకు ప్రభుత్వం రూ.2.50 లక్షలకు పెంచింది. బడ్జెట్ మేరకు ప్రోత్సాహకం అందిస్తున్నాం. జిల్లాలో 182 మందికి పోత్సాహకం అందించాల్సి ఉంది. ఈ సొమ్ముతో తల్లిదండ్రుల మద్దతు లేనివారు జీవితంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. దీనిపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నాం.
– రాజ్‌కుమార్, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి
Comments
Please login to add a commentAdd a comment