ఇసుక అక్రమ రవాణాకు చెక్
● తనిఖీల కోసం జిల్లాలో ప్రత్యేక బృందాలు
● సరిహద్దుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటుకు అధికారుల నిర్ణయం
మెట్‌పల్లి: జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఉన్నతాధికారులు దృష్టి సారించారు. నిన్నామొన్నటివరకు గోదావరి, ఇతర వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుక నిబంధనలకు విరుద్ధంగా తరలిపోతున్నప్పటికీ అధికార యంత్రాంగం పట్టించుకోలేదు. ఇటీవల ప్రభుత్వం ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా తరలిపోకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. దీంతో ఉన్నతాధికారులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. తనిఖీల కోసం ప్రత్యేకంగా బృందాలు, సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసే లా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అక్రమమే ఎక్కువ..
● ఇసుకను అందుబాటులో ఉంచడానికి జిల్లాలో సిరికొండ, పైడిమడుగు, సాతారాం, ఆత్మకూర్, ఇటిక్యాలలో రీచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
● ఇంతవరకు ఇందులో ఏ ఒక్కచోట కూడా విక్రయాలను మొదలు పెట్టలేదు.
● తద్వారా జిల్లా అంతటా గోదావరి, వాగుల నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
● కేవలం జిల్లాకే పరిమితం కాకుండా కొన్ని ప్రాంతాల నుంచి ఇసుకను నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు కూడా టిప్పర్లల్లో తరలిస్తున్నారు.
● కొన్నిచోట్ల అధికారులు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లను పట్టుకుంటుంటే, మరికొన్ని చోట్ల మాత్రం ‘మామూలు’గా తీసుకుంటూ వదిలేస్తున్నారు.
ముఖ్యమంత్రి సమీక్ష తర్వాత
● ఇటీవల ముఖ్యమంత్రి అధికార యంత్రాంగంతో జరిపిన సమీక్షలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని చెప్పడంతోపాటు దానికి సహకరించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
● దీంతో ఇంతకాలం అక్రమ రవాణాను అంతగా పట్టించుకోని జిల్లా ఉన్నతాధికారులు.. ప్రస్తుతం దానికి అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించారు.
● జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాలకు కూడా ఇసుక తరలిపోకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
● ఇందుకు మైనింగ్, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే అవసరమైన చోట చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.
● మెట్‌పల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న క థలాపూర్ మండలం నుంచి నిజామాబాద్, నిర్మల్ జిల్లాలకు అక్రమంగా ఇసుక తరలిపోతోంది.
● దీనికి అడ్డుకట్ట వేయడం కోసం మల్లాపూర్ మండలంలోని ఓబులాపూర్ వంతెన, ఇబ్రహీంపట్నం మండలంలోని గండి హన్మాన్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులు ప్రతిపాదించారు.
రీచ్‌ల ప్రారంభంపైనా దృష్టి పెట్టాలి
● జిల్లాలో ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
● దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు రీచ్‌లను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
● రీచ్‌లతో ఇసుక దొరకడంతోపాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
Comments
Please login to add a commentAdd a comment