ఆశలు ఆవిరి
గొల్లపల్లి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికల బరిలో నిలవాలని భావించిన ఆశావహుల ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడైనా రావొచ్చని ఎమ్మెల్యేలు సంకేతాలు ఇవ్వడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. దీంతో చాలామంది ఆశావహులు పోటీ చేసేందుకు ముందుకొచ్చి ఆర్థిక వసనరులు సమకూర్చుకుంటున్నారు. ఇంతలోనే ప్రభుత్వం మరోసారు కులగణన సర్వే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధతపై ప్రకటన చేయడంతో ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఫలితంగా ఇన్నాళ్లు హైరానా పడిన ఆశావహుల్లో నైరాశ్యం అలుముకుంది.
ఒక్కో ప్రక్రియ ముగియడంతో..
గతేడాది ఫిబ్రవరి రెండు గ్రామ పంచాయతీల పాలకవర్గాల పదవీ కాలం ముగిసింది. ఆగస్టులో జిల్లా, మండల పరిషత్ పదవీకాలం పూర్తయింది. ఆ తర్వాత ఇటు పంచాయతీలు, అటు పరిషత్‌లు పత్యేకాధికారుల పాలన కిందకు వెళ్లాయి. అనంతరం ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఒక్కో ప్రక్రియను పూర్తి చేస్తూ వచ్చింది. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల సామగ్రి సమకూర్చుకోవడంతోపాటు సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి చేశారు. ఇవన్నీ జరుగుతుండటంతో ఎన్నికలే తరువాయి అన్నట్లు ఆశావహులు హడావుడి చేశారు. తాజాగా ప్రభుత్వ ప్రకటన వారిలో నైరాశ్యాన్ని నింపింది.
వేడెక్కి.. చల్లారి
స్థానిక పోరుకు అంతా సిద్ధమవడంతో కొద్దిరోజుల క్రితం జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పంచాయతీల్లో తాము మద్దతు ఇచ్చిన వారిని గెలుపించుకోవడం, పార్టీ గుర్తులతో నిర్వహించే పరిషత్ ఎన్నికల్లో బలనిరూపణను అన్ని పార్టీల నేతలు సవాల్‌గా తీసుకున్నారు. జిల్లాలో 383 గ్రామ పంచాయతీలు, 20 జెడ్పీటీలు, 262 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలుత పరిషత్.. ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ నాయకులు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు, ఆశావహులతో సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చంటూ నేతలు, కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. పంచాయతీలో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీకి దిగాలని భావించిన వారు ఎంత ఖర్చు చేయాలో ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి వనరులు సమకూర్చుకున్నారు. అలాగే స్థానికులతో మమేకం కావడం, యువత మద్దతు కూడగట్టుకోవడంపై దృష్టి సారించారు. తాజాగా ప్రభుత్వం మరోసారి కులగణనకు అవకాశం ఇవ్వడంతో రాజకీయం చప్పున చల్లారింది. ఇప్పటికే నిర్వహించిన కులగణనలో లక్షల మంది సర్వేలో పాల్గొనకపోవడంతో ఈనెల 28వరకు మరోసారి కులగణన నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్‌లైన్ సర్వేతోపాటు టోల్‌ఫ్రీ నంబర్ ద్వారా ఎంపీడీఓ కార్యాలయంలో నమోదు చేసుకునే విధంగా అవకాశం కల్పించారు.
మే వరకు వేచి చూడాల్సిందే..
ఈనెల చివరిలోగా బీసీ కులగణన రీసర్వే పూర్తి చేసి దాన్ని అసెంబ్లీలో ఆమోదించనున్నారు. తర్వాత పార్లమెంట్‌లో ఆమోదించడానికి పంపించనున్నారు. బీసీలకు 42 శాతం రిజరేషన్ అమలుకు చట్టబద్దత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి మే, జూన్ నెలల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండవచ్చని నేతలు పేర్కొంటున్నారు. అప్పటి వరకు పరిస్థితితులు మారకుండా చూసుకోవడం తలకు మించిన భారంగా మారుతుందని ఆశావహులు భయపడుతున్నారు.
పరిషత్, పంచాయతీ ఎన్నికలు మరింత జాప్యం..?
ఎప్పుడు నిర్వహిస్తారనే అంశంపై సందిగ్ధత
వనరులు సమకూర్చుకున్న ఆశావహుల్లో నైరాశ్యం
Comments
Please login to add a commentAdd a comment