అప్పుల్లో పంచాయతీ కార్యదర్శులు
గొల్లపల్లి: జిల్లాలో 380 గ్రామ పంచాయతీలు ఉండగా.. కొత్తగా మరో మూడు పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో ఆ సంఖ్య 383కు చేరింది. కొన్ని పంచాయతీల్లో మాత్రమే ఆదాయ వనరులు ఉండగా.. అత్యధిక పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. అరకొరగా వసూలైన పన్నులు ఏ మూలకూ సరిపోవడం లేదు. మరో వైపు పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో భారమంతా కార్యదర్శులపైనే పడుతోంది. ప్రత్యేకాధికారులు ఉన్నా.. పర్యవేక్షించడమే తప్ప ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లు, ఆటోలు, విద్యుత్ దీపాల నిర్వహణ, బోర్ మోటార్లు, పైపులైన్‌ల నిర్వహణ వంటి వాటికి కార్యదర్శులు అప్పు చేయాల్సి వస్తోంది. నెలనెలా ఖర్చులు భరించడం భారంగా మారిందని పలువురు కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.లక్షదాకా అప్పు
చిన్న పంచాయతీల్లో కార్యదర్శులు రూ.30వేలపైగా సర్దుబాటు చేశారు. కొన్నిచోట్ల రూ.50 వేల నుంచి రూ.లక్షదాకా అప్పు చేశారు. నెలల తరబడి వి ద్యుత్ దీపాలు, బోర్ మోటార్ల నిర్వహణ, పైపులైన్ పగిలినా.. స్టార్టర్లు దెబ్బతిన్నా కార్యదర్శులే చేయిస్తున్నారు. పంచాయతీ ట్రాక్టర్లు డీజిల్, మెయింటనెన్స్‌కు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. చాలాగ్రామాల్లో నిధులు లేక వీధి లైట్లను మార్చడానికి ఇబ్బంది పడుతున్నారు. పారిశుధ్య కూలీలకు డబ్బులు సర్ధుబాటు చేయడం భారంగా మారింది.
నిధులొస్తేనే..
పంచాయతీ ఎన్నికలకు ముందుగానే పెండింగ్‌లో ఉన్న నిధులు వస్తే తాము చేసిన అప్పులు తీర్చుకో గలుగుతామని కార్యదర్శులు పేర్కొంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికలు వాయిదా పడుతుండంటంతో పెండింగ్ నిధులు వచ్చే పరిస్థితి కానరావడం లేదని వాపోతున్నారు. ఏ పంచాయతీ కార్యదర్శిని కదిలించినా సొంత అవసరాలకన్న పంచాయతీ అవసరాలకే ఎక్కువ అప్పు చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న నిధులు వస్తే తప్ప గట్టెక్కలేమని పేర్కొంటున్నారు.
నిధులు రాక..
పంచాయతీలకు ఎస్‌ఎఫ్‌సీ, 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. పంచాయతీ పాలక వర్గాలు ఉంటే నిర్వహణ వ్యయం అంతా వారే చూసుకునే వారు. సర్పంచ్‌లు లేక భారమంతా కార్యదర్శులపై పడింది. ప్రత్యేకాధికారులు ఎక్కడా ఆర్థిక వ్యవహారాలను పట్టించుకోవడం లేదు. మరోవైపు 13 నెలలు గడుస్తున్నా నిధుల సమస్య వేధిస్తోంది. కొన్నిచోట్ల మాత్రమే సర్ధుబాటు అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏడాదికిపైగా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన
విడుదల కాని 15వ ఆర్థిక సంఘం, ఎస్‌ఎఫ్‌సీ నిధులు
ట్రాక్టర్లు, విద్యుత్ దీపాలు, బోర్ల నిర్వహణకు ఇబ్బందులు
అప్పు చేసి పనులు చేయిస్తున్నామంటున్న కార్యదర్శులు
గొల్లపల్లి మండలం ఇబ్రహీంనగర్ పంచాయతీ కార్యదర్శి గ్రామాల్లో ప్రత్యేక పాలన వచ్చినప్పటి నుంచి రూ.90వేలు సొంతంగా ఖర్చు చేశాడు. ఇంకా రూ. లక్ష వరకు ఎలక్ట్రికల్ షాప్‌లో అప్పు చెల్లించాల్సి ఉంది. అలాగే ఓ ఫర్టిలైజర్ షాప్‌లో సీజన్‌లో దోమల మందు, పారిశుధ్యం సామగ్రి తీసుకొచ్చాడు. రూ. 40వేల చెక్కు ఇచ్చి 8 నెలలు అవుతోంది. ఖాతాలో డబ్బులు లేక ఆ చెక్కు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఇంటి పన్ను, నీటి పన్నులను ట్రెజరీలో జమ చేసి సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. ఈయనకు వచ్చే అరకొర వేతనంతోనే ఇల్లు నొట్టుకొస్తున్న ఆయన.. పంచాయ తీ కోసం అప్పు తెచ్చి మరి ఖర్చు చేస్తున్నాడు. ఇది ఈ ఒక్క కార్యదర్శిదే కాదు.. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులందరిది.
ఇబ్బంది నిజమే
పంచాయతీల్లో నిధులు కొరత ఉన్నమాట వాస్తవమే. అందుబాటులో ఉన్న సాధారణ నిధులు, పన్నుల వసూల ద్వారా పంచాయతీలను ఎలాగోలా గటిక్కిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదల కావడం లేదు. నిధులు రాకుంటే రానున్న వేసవికాలంలో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది. – సురేశ్ రెడ్డి. భీంరాజ్‌పల్లి
ప్రత్యేకాధికారి, ఎంపీవో గొల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment