హలో.. నేను కమిషనర్‌ను మాట్లాడుతున్నా.. | - | Sakshi
Sakshi News home page

హలో.. నేను కమిషనర్‌ను మాట్లాడుతున్నా..

Published Tue, Feb 18 2025 2:00 AM | Last Updated on Tue, Feb 18 2025 1:55 AM

హలో.. నేను కమిషనర్‌ను మాట్లాడుతున్నా..

హలో.. నేను కమిషనర్‌ను మాట్లాడుతున్నా..

జగిత్యాల: సోమవారం ఉదయం.. 10 గంటల సమయంలో టవర్‌ సర్కిల్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారికి 6300805117 నంబర్‌ నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ‘నేను జగిత్యాల మున్సిపల్‌ కమి షనర్‌ను మాట్లాడుతున్న. మీరు ఆస్తిపన్ను చెల్లించాలి. లేకుంటే నోటీసు జారీ చేసి కేసు బుక్‌ చేస్తాం..’ అని పేర్కొన్నాడు. దీంతో ఆ వ్యాపారి ఎక్కడి నుంచి ఫోన్‌ చేస్తున్నారని తిరిగి ప్రశ్నించగా.. ఇదే నంబరుకు ఫోన్‌పే ద్వారా చెల్లించాలని హుకూం జారీ చేశాడు. విషయాన్ని సదరు వ్యా పారి మున్సిపల్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తామెవరికీ ఫోన్‌ చేయలేదని, పన్నులు కార్యాలయానికి వచ్చి చెల్లించాలని చెప్పారు సిబ్బంది.

జిల్లా కేంద్రంలోని టవర్‌సర్కిల్‌ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోలేదని, ఆస్తిపన్ను చెల్లించాలని, రూ.3 వేలు 6300805117 నంబర్‌కు ఫోన్‌ పే చే యాలని కాల్‌ వచ్చింది. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి వార్డు అధికారికి ఫోన్‌ చేయగా అది ఫేక్‌ అని తేలింది. వారంరోజులుగా 6300805117 నంబరు నుంచి ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజు చెల్లించాలంటూ కాల్స్‌ వస్తున్నాయి. ఈ నంబరు ట్రూ కాలర్‌లో జగిత్యాల మున్సిపల్‌ కమిషనర్‌ అనే కనిపిస్తోంది. దీంతో కొందరు కమిషనర్‌ కావచ్చని చెల్లించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కొత్త పంథాలో నేరగాళ్లు

ప్రస్తుత హైటెక్‌ యుగంలో సైబర్‌ నేరగాళ్ల వలలో పడి అనేక మంది మోసపోతున్నారు. ఆర్థిక సంవత్సరం మార్చితో ముగియనుండడంతో మున్సిపల్‌ సిబ్బంది పన్నుల వసూళ్లపై దృష్టి సారించారు. ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆసరా చేసుకుంటు న్న ఆర్థిక నేరగాళ్లు వ్యాపారుల నంబర్లకు ప్రతి రోజూ ఫోన్‌ చేస్తున్నారు. ఈ మేరకు మున్సిపల్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ట్రేడ్‌లైసెన్స్‌, ఇతరత్రా పన్నులను మీసేవలో.. ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశం ఉందని, లేదా మున్సిపల్‌ కార్యాలయంలో చెల్లించవచ్చని అంటున్నారు. మున్సి పల్‌ కమిషనర్‌ పేరిట వచ్చే కాల్స్‌పై అప్రమత్తంగా ఉండాలంటున్నారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌, డిజిటల్‌ లావాదేవీలు ఎక్కువ కావడంతో సైబర్‌క్రైం అనేకం చోటుచేసుకుంటున్నాయి. పండుగలు వచ్చాయంటే చాలు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. మొన్నటివరకు పీఎం కిసాన్‌ పేరిట ఏపీకే ఫైల్స్‌ వాట్సాప్‌లో పంపించిన కేటుగాళ్లు.. దాని ని ఓపెన్‌ చేయగానే సంబంధిత వ్యక్తుల ఫోన్లు హ్యాకయ్యేలా చేశారు. ప్రస్తుతం వస్తున్న 6300 805117 నంబరు నుంచి ఫోన్‌ వస్తే ఎత్తవద్దని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఫోన్‌ లిఫ్ట్‌ చేసినా లావాదేవీలు చేయొద్దని సూచిస్తున్నారు.

కొత్త పంథా ఎంచుకున్న సైబర్‌ నేరగాళ్లు

ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ చెల్లించాలంటూ ఆదేశాలు

6300805117 నంబర్‌ నుంచి ఫోన్‌కాల్స్‌

ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దు

ఇటీవల ఆస్తిపన్ను, ట్రేడ్‌లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని 6300805117 నంబరు నుంచి కాల్స్‌ వస్తున్నాయి. ప్రజలు నమ్మవద్దు. ఆస్తిపన్ను చెల్లించేందుకు నేరుగా కార్యాలయంలో గానీ, లేదా మీసేవ కేంద్రాల్లో, ఫోన్‌పే/గూగుల్‌పే ద్వారా చెల్లించవచ్చు. పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ట్రూకాలర్‌ యాప్‌లో కమిషనర్‌ అని ఉంటుంది. అయినా నమ్మవద్దు.

– చిరంజీవి, మున్సిపల్‌ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement