సన్నాలకు అందని బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

సన్నాలకు అందని బోనస్‌

Published Fri, Feb 21 2025 8:44 AM | Last Updated on Fri, Feb 21 2025 8:40 AM

సన్నాలకు అందని బోనస్‌

సన్నాలకు అందని బోనస్‌

● సన్న రకం వడ్లకు మద్దతు ధరతోపాటు బోనస్‌ ఇస్తామన్న సర్కార్‌ ● కొనుగోలు కేంద్రాల్లో విక్రయించిన అన్నదాతలు ● కొందరికి మాత్రమే విడుదలైన డబ్బులు ● ఇంకా వందలాది మంది రైతుల ఎదురుచూపులు ● రావాల్సిన డబ్బులు రూ.10.16 కోట్లు ● ఒక్క జైనా సంఘానికే రూ 2.80 కోట్లు

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యాయి. అయితే సన్న ధాన్యం అమ్మిన రైతుల్లో కొందరికి ఇంకా బోనస్‌ జమ కాలేదు. సన్న ధాన్యం క్వింటాల్‌కు ప్రభుత్వ మద్దతు ధర రూ.2,320 ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా క్వింటాల్‌కు రూ.500 ఇస్తామని ప్రకటించింది. అయితే కొనుగోలు కేంద్రాల్లో సన్న ధాన్యం విక్రయించిన రైతులకు మద్దతు ధర రైతుల ఖాతాల్లో జమ అయినప్పటికీ.. బోనస్‌ మాత్రం జమ కావడం లేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.

సన్న ధాన్యం 3.10 లక్షల క్వింటాళ్లు

జిల్లాలో సన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 68 ఐకేపీ, సింగిల్‌ విండో కొనుగోలు కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఈ కేంద్రాల ద్వారా 3,10,921.60 క్వింటాళ్ల సన్నవడ్లను కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు గింజ పొడవు, వెడల్పు నిష్పత్తుల ఆధారంగా 30 రకాల సన్న ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. ఆ సమయంలోనే తప్ప, తాలు పేరిట కిలో నుంచి రెండు కిలోల వరకు తరుగు తీశారు. ఇలా కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లులకు పంపించారు. సన్న ధాన్యం పండించిన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూ.500 బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో దాదాపు 1.50 లక్షల ఎకరాల్లో సన్న వడ్లను పండించారు. చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లలేక పచ్చి వడ్లనే క్వింటాల్‌కు రూ.2800 చొప్పున రైస్‌మిల్లుల్లో విక్రయించుకున్నారు. బోనస్‌ ఆశతో కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లిన రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి, తేమ శాతం లేకుండా విక్రయించినా ఇంకా బోనస్‌ అందకపోవడంపై ఆందోళన చెందుతున్నారు.

రైతులకు చెల్లించాల్సిన బోనస్‌

రూ.15.54 కోట్లు

సన్న ధాన్యం అమ్మిన రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బోనస్‌ రూ 15.54 కోట్లు. ఇందులో వివిధ దఫాలుగా ఇప్పటి వరకు కేవలం రూ.5.38 కోట్లు మాత్రమే చెల్లించారు. ఇంకా రూ.10.16 కోట్ల వరకు బోనస్‌ చెల్లించాల్సి ఉంది. ధర్మపురి మండలంలోని జైనా సొసైటికే రూ.2.80 కోట్ల బోనస్‌ రావాల్సి ఉంది. జైనా సొసైటీ పరిధిలోని దమ్మన్నపేట కొనుగోలు కేంద్రంలో దాదాపు 350 మంది రైతులు ఏడు వేల క్వింటాళ్ల సన్న ధాన్యం విక్రయించారు. సన్నధాన్యం విక్రయించిన 48 గంటలలోపు బోనస్‌ జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం అమలు కాలేదు. 16 నవంబర్‌ 2024న తొలిసారి బోనస్‌ విడుదల చేసిన ప్రభుత్వం.. ఇప్పటివరకు విడుతల వారీగా విడుదల చేస్తోంది. బోనస్‌ కోసం ప్రతిరోజూ రైతులు బ్యాంకులకు వెళ్లి తమ ఖాతాల్లో డబ్బుల గురించి చెక్‌ చేయించుకుంటున్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నవంబర్‌ నుంచి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంకా కొంతమంది రైతులకు బోనస్‌ డబ్బులు రాకపోవడంపై గుర్రుగా ఉన్నారు.

బోనస్‌ లెక్కల వివరాలు ఈ–కుబేర్‌యాప్‌కు

సన్న ధాన్యం కొనుగోలు నుంచి బోనస్‌ జమ అయ్యే వివరాలను ఈ–కుబేర్‌ యాప్‌కు పంపిస్తున్నారు. ఇందులో సివిల్‌ సప్లయ్‌ కమిషనర్‌ పీడీ అకౌంట్‌ ఉంది. ఆ అకౌంట్‌లో సివిల్‌ సప్లయ్‌ శాఖ డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. బోనస్‌ చెల్లింపులు తొలిసారి కావడంతో కొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికీ విడుతలవారీగా బోనస్‌ డబ్బులు జమ చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బోనస్‌ రాని రైతులు ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బోనస్‌ కోసం అవసరమైతే ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement