యూరియా కోసం ఎదురుచూపులు
బుగ్గారం/కోరుట్లరూరల్: వరి, మొక్కజొన్న చివరి దశకు చేరడంతో యూరియాకు డిమాండ్ ఏర్పడింది. దీంతో రైతులు ఆగ్రోస్ సేవా కేంద్రాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్ కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. అక్కడ సరిపడా లేకపోవడంతో పడిగాపులు కాస్తున్నారు. యూరియా లోడ్ ఎప్పుడొస్తుందా.. అని అక్కడే వేచి ఉంటున్నారు. కొందరు చెప్పులు, ఆధార్‌కార్డు, పాస్‌బుక్కులను లైన్‌గా పెడుతున్నారు. బుగ్గారం మండలానికి మొత్తం 350 నుంచి 400 టన్నుల వరకు యూరియా అవసరం ఉండగా కేవలం 200 టన్నులే వచ్చింది. ఇంకా 200 టన్నుల వరకు యూరియా రావాల్సి ఉంది. అలాగే కోరుట్ల మండలం మాదాపూర్ పీఏసీఎస్‌కు గురువారం యూరియా రావడంతో రైతులు బారులు తీరారు. చివరిగా వచ్చిన కొందరికి యూరియా లభించక వెనుదిరిగారు.
ఆందోళన వద్దు : ప్రభుత్వ విప్ అడ్లూరి
ధర్మపురి: యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 24 గంటల్లో సరిపడా తెప్పిస్తామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని జైనా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని గురువారం సందర్శించారు. యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆయన దృష్టికి తీసుకురాగా పై విధంగా స్పందించారు. సంబంధిత ప్రిన్సిపాల్ సెక్రెటరీ, డైరెక్టర్, జిల్లా కలెక్టర్లలతో ఫోన్‌లో మాట్లాడి సరిపడా యూరియాను తెప్పించాలని కోరారు. ఆయన వెంట ఏఎంసీ వైస్ చైర్మన్ సంగ నర్సీంహులు, నాయకులు ఎస్.దినేష్, చీపిరిశెట్టి రాజేష్, సింహరాజు ప్రసాద్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment