క్షుద్రపూజల కలకలం
కరీంనగర్‌రూరల్: మనిషి చంద్ర మండలంలోకి వెళ్తున్న ఈ కాలంలో గ్రామీణులు కొందరు ఇంకా మూఢనమ్మకాలపైనే ఆధారపడుతున్నారు. దుర్శేడ్ ఉన్నత పాఠశాల, చెర్లభూత్కూర్‌లో ఓ అంగన్‌వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలు చేయడం గురువారం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. దుర్శేడ్ హైస్కూల్లో బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ప్రధానోపాధ్యాయుడి గది ఎదుట పసుపు, కుంకుమతో ముగ్గులు వేసి, నిమ్మకాయలు పెట్టి, క్షుద్రపూజ చేశారు. మరుసటిరోజు ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు వాటిని చూసి, భయభ్రాంతులకు గురయ్యారు. ఇన్‌చార్జి హెచ్‌ఎం రత్నాకర్ వెంటనే వాటిని తొలగించారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఇలా చేసి ఉంటారని, ఎవరూ భయపడవద్దని ధైర్యం చెప్పారు. అలాగే, చెర్లభూత్కూర్‌లో ఓ అంగన్‌వాడీ టీచర్ ఇంటి ఎదుట క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
ఆర్‌ఐపై ఆర్డీవోకు ఫిర్యాదు
మంథని: ముత్తారం ఆర్‌ఐ శ్రీధర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఖమ్మంపల్లికి చెందిన తీర్థల కొమురెల్లి గురువారం ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివరాల ప్రకారం.. ముత్తారం మండలం ఇప్పలపల్లి శివారులోని 9 గంటల వ్యవసాయ భూమిని పట్టా చేయిస్తానంటూ కొమురెల్లి వద్ద ఆర్‌ఐ శ్రీధర్ రూ.10 వేలు తీసుకున్నాడు. కానీ, పని చేయలేదు. అడిగితే డబ్బులు పాత తహసీల్దార్‌కు ఇచ్చానని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని బాధితుడు ఆరోపించాడు. ఆర్‌ఐపై చర్యలు తీసుకొని, భూమిని తన పేరిట పట్టా చేయాలని ఆర్డీవోను కోరినట్లు తెలిపాడు.
కారు బోల్తా
జూలపల్లి(పెద్దపల్లి): పెద్దపల్లి మండలం లోకపేట కోళ్ల ఫాం వద్ద గురువారం ఓ కారు బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. లోకపేట నుంచి కాచాపూర్ వరకు డబుల్ రోడ్డుగా మార్చేందుకు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో పెద్దపల్లి నుంచి వెంకట్రావుపల్లె వైపు వస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, ఎవరు ఫిర్యాదు చేయలేదని, సమాచారం కూడా లేదని జూలపల్లి ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment