వెలుగులోకొస్తున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు
● సర్వే చేస్తున్న రెవెన్యూ అధికారులు ● 142 మందికి పాస్‌బుక్‌ల జారీ ● సుమారు 100 ఎకరాల వరకు అక్రమ పట్టాలు
నోటీసులు జారీ చేశాం
నర్సింగాపూర్ గ్రామ శివారులోని సర్వేనంబరు 437, సర్వేనంబరు 251లో ధరణి కంటే ముందు అక్కడున్న భూమి ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. కానీ 437 సర్వేనంబరులో 142 మంది పాస్‌బుక్‌లు పొందారు. వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశాం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్సింగాపూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసేందుకు సర్వే కొనసాగుతోంది.
– శ్రీనివాస్, తహసీల్దార్, జగిత్యాల రూరల్
జగిత్యాలరూరల్: ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు.. దర్జాగా కబ్జా చేస్తున్నారు. మరి కొంతమంది అక్రమంగా పట్టా చేయించుకుని సాగు చేసుకుంటున్నారు. దీనికి గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌ను ఆసరాగా చేసుకున్నారు. పోర్టల్‌లో ఉన్న లోటుపాట్లతోపాటు అధికారులను మచ్చిక చేసుకుని పాస్‌బుక్‌లు పొందుతున్నారు. ఇలా జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్ గ్రామంలోని సర్వేనంబరు 437లో 378 ఎకరాల భూమి ఉండగా.. సుమారు 100 ఎకరాలకు అక్రమంగా పాస్‌బుక్‌లు పొందారు. అలాగే సర్వేనంబరు 251లో 207.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. అందులోనూ కొంతమంది అక్రమంగా పట్టాలు పొందారు. బడా నాయకులు అప్పటి తహసీల్దార్‌తోపాటు ఉన్నతస్థాయి అధికారుల సహకారంతో పట్టాలు పొందినట్లు వెల్లడైంది. సర్వేనంబరు 437లో 142 మంది పాస్‌బుక్‌లు పొందారు. దీంతో ఆ భూమిని చదును చేసి కొంతమంది సాగు చేసుకుంటుండగా.. కొంతమంది ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకు ఇచ్చుకుని రూ.లక్షలు సంపాదిస్తున్నారు. సుమారు 142 మంది ప్రభుత్వ భూమికి పాస్‌బుక్‌లు తీసుకుని ఇప్పటివరకు సుమారు రూ.70 లక్షల మేర రైతుబంధు పొందినట్లు అధికారులు నిర్ధారించారు.
నోటీసులు జారీ
నర్సింగాపూర్ శివారులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా పట్టాలు పొందిన వారికి జగిత్యాల రూరల్ తహసీల్దార్ 10 రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. అక్రమ పట్టాలు పొందిన వారు నోటీసులకు జవాబులు ఇవ్వాల్సి ఉన్నా.. వారి నుంచి స్పందన రాకపోవడం గమనార్హం.
83 మందివి ఫేక్ పట్టాలని నివేదిక అందజేత
నర్సింగాపూర్ శివారులోని సర్వేనంబరు 437లో పట్టాదారు పాస్‌బుక్‌లు పొందిన వారిలో 83 మందివి నకిలీ పట్టాలేనని తహసీల్దార్ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. దీంతో పాటు, ధరణి రాక ముందు పహణిల్లో మాత్రం ప్రభుత్వ భూమి గానే నమోదై ఉందని నివేదికలో పేర్కొన్నారు.
కొనసాగుతున్న సర్వే
ప్రభుత్వ భూమిలో అక్రమ పట్టాలు పొందారని విషయం వెలుగు చూడటంతో కలెక్టర్ ఆదేశాల మే రకు పదిహేను రోజులుగా నర్సింగాపూర్ శివారులో ఉన్న ప్రభుత్వ భూములకు రెవెన్యూ యంత్రాంగం ఆధ్వర్యంలో సర్వే చేస్తూ హద్దులు నిర్ణయిస్తున్నారు.
ఇటుక బట్టీలకు అద్దెకు..
నర్సింగాపూర్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూముల్లో అక్రమ పట్టాలు పొందిన వారిలో చాలామంది ఆ భూములను చదును చేసి ఇటుక బట్టీల వ్యాపారులకు అద్దెకిచ్చి లక్షలాది రూపాయలు పొందుతున్నారు. ఇదే అదునుగా భావించిన ఇటుక బట్టీల వ్యాపారులు కూడా సమీపంలో ఉన్న ప్రభుత్వ భూ మిని చదును చేస్తూ వినియోగించుకుంటున్నారు.
వెలుగులోకొస్తున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు
వెలుగులోకొస్తున్న ప్రభుత్వ భూ ఆక్రమణలు
Comments
Please login to add a commentAdd a comment