కథలాపూర్: ట్రాక్టర్ల బ్యాటరీలు చోరీ చేసిన కేసులో నలుగురికి 6 నెలలు జైలుశిక్ష విధిస్తూ కోరుట్ల న్యాయమూర్తి పావని సోమవారం తీర్పునిచ్చారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సురేశ్, గంగప్రసాద్, ఎస్‌కే.ఆసిఫ్, నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లికి చెందిన ఎస్‌కే.ఖదీర్‌లు గతేడాది జూలై 9న కథలాపూర్ మండలంలోని ఇప్పపెల్లిలో 3 ట్రాక్టర్ల బ్యాటరీలు దొంగిలించారు. పోలీసులు వారిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. నేరం రుజువు కావడంతో జడ్జి ఆ నలుగురికీ శిక్ష ఖరారు చేశారు.
విద్యార్థినిని వేధించినందుకు 20 రోజులు..
జగిత్యాలజోన్: పాఠశాల విద్యార్థినిపై అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా వెంటపడి వేధించిన కేసులో నిందితుడికి 20 రోజుల జైలు, రూ.26 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామంలో పాఠశాలకు వెళ్తున్న విద్యార్థినిని వెంటపడుతూ వేధించిన ధర్మపురికి చెందిన ఒడ్డెటి చంద్రతేజపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రతేజకు 20 రోజుల జైలు శిక్షతోపాటు రూ.26 వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.
అన్న హత్య కేసులో చెల్లెళ్ల అరెస్టు
జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన జంగిలి శ్రీనివాస్(52)ను హత్య చేసిన అతని చెల్లెళ్లను సోమవారం అరెస్టు చేసినట్లు జగిత్యాల టౌన్ సీఐ వేణుగోపా ల్ తెలిపారు. ఆస్తి తగాదా విషయంలో శ్రీనివా స్‌పై అతని చెల్లెళ్లు భారతపు వరలక్ష్మి, ఒడ్నాల శారద కర్రలతో దాడి చేయగా మృతిచెందాడన్నారు. ఈ కేసులో మృతుడి చెల్లెళ్లను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
గంజాయి కేసులో ఇద్దరికి ఐదేళ్లు..
సిరిసిల్ల కల్చరల్: గంజాయి రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలుశిక్ష విధిస్తూ రాజన్నసిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎన్.ప్రేమలత సోమవారం తీర్పునిచ్చారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వివరాల ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వడిచెర్ల జాన్‌ప్రతాప్ రెడ్డి, నాంపల్లికి చెందిన గుమ్మడిపల్లి చంద్రశేఖర్ ఐదేళ్ల క్రితం వేములవాడ పట్టణంలో గంజాయి రవాణా చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు వారని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి సీఐ వెంకటేశ్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల లక్ష్మీప్రసాద్ కేసు వాదించారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ ఐదేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు వెల్లడించారు. నేరస్తులకు శిక్ష పడేందుకు కృషి చేసిన పోలీసులను ఎస్పీ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment