దర్శిద్దాం.. తరిద్దాం
● నేటి నుంచి వేములవాడలో మహాశివరాత్రి ఉత్సవాలు ● మూడు రోజులు ముక్కోటి పండుగ ● 4 లక్షల మంది వస్తారని అంచనా ● రూ.2.39కోట్లతో ఏర్పాట్లు ● 1500 మందితో బందోబస్తు
వేములవాడ: హరహర మహాదేవ.. శంభో శంకర.. జై మహాదేవ్.. నామస్మరణతో వేములవాడ పురవీధులు మారుమోగనున్నాయి. పేదల దేవుడిగా పేరొందిన దక్షిణకాశీ వేములవాడలో నేటి నుంచి మూడు రోజులు మహాశివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 4లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచన. రూ.2.39కోట్లతో ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల కోసం శివార్చన వేదికను సిద్ధం చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తులకు స్వాగతం పలికేందుకు తోరణాలు, సీసీ కెమెరాల మధ్య భద్రతను పర్యవేక్షిస్తున్నారు.
కోడె మొక్కులు ప్రత్యేకం
భక్తుల కోరిన కోర్కెలు నెరవేరితే రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకుంటారు. పాడిపంటలు బాగుండాలని మొక్కుకున్న రైతులు ఆలయానికి నిజకోడెలు సమర్పిస్తుంటారు. కల్యాణకట్టలో రూ.10 టికెట్ తీసుకుని తలనీలాలు సమర్పించుకుంటుంటారు. బద్దిపోచమ్మకు బోనం మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ.
ప్రసాదం
రాజన్నను దర్శించుకున్న భక్తులకు ప్రసాదాలు అందించేందుకు ధర్మగుండం పక్కనే ఉన్న ప్రసాదాల కౌంటర్, దేవస్థానం దక్షిణ ద్వారం వద్ద, పూర్వపు ఆంధ్రాబ్యాంకులో, భీమేశ్వరాలయం వద్ద ప్రసాదాల కౌంటర్ ఏర్పాటు చేశారు. లడ్డూ రూ.20, పులిహోరా ప్యాకెట్ రూ.15 చొప్పున విక్రయిస్తారు.
జాతర ప్రత్యేక పూజలు
మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈనెల 25 నుంచి నిరంతర దర్శనాలు అందుబాటులో ఉంటాయి. ధర్మదర్శనంతోపాటు రూ.300 వీఐపీ దర్శనం, రూ.50 స్పెషల్ దర్శనాలు, రూ.100 కోడెమొక్కులు, రూ.200 స్పెషల్ కోడెమొక్కులు, రూ.100 శీఘ్రదర్శనం టికెట్లు అందుబాటులో ఉంచుతున్నారు. ఈనెల 25వ దేదీ రాత్రి 7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పి స్తారు. రాత్రి 9.30 గంటలకు నిషిపూజ అనంత రం సర్వదర్శనం కొనసాగుతోంది. 26న ఉద యం 8 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వా మి వారికి పట్టువస్త్రాలు అందజేస్తారు. సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు శివస్వాములకు, 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అద్దాల మంటపంలో మహాలింగార్చన, రాత్రి 11.35 గంటల నుంచి వేకువజాము 3.30 గంటల వరకు లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పూజలు నిర్వహిస్తారు.
ఉచిత భోజనం..టిఫిన్..తాగునీరు
మూడురోజులపాటు స్థానిక ట్రస్టుల ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి కాంప్లెక్సులో ఉచితంగా భోజ నం, పార్వతీపురంలో స్వామి వారి అన్నదాన సత్రంలో ఉచిత భోజనం, టిఫిన్ వసతి ఉంది. భక్తుల దాహార్తిని తీర్చేందుకు 6 లక్షల నీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. ఆరు రాజన్న జలప్రసాదాల సెంటర్లను ఏర్పాటు చేశా రు. ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లను అందజేయనున్నారు. వేములవాడలో వంద వసతి గదులను అందుబాటులో ఉంచారు. 3.90 లక్షల చదరపు మీటర్లలో చలువపందిళ్లు వేశారు. స్నానానికి 157 షవర్లు ఏర్పాటు చేశారు. ధర్మగుండంలోకి గోదావరి జలాలను పంపింగ్ చేస్తున్నారు. గత ఈతగాళ్లను అందుబాటులో పెట్టారు. భక్తుల కోసం 4 లక్షల లడ్డూలను సిద్ధం చేశారు.
అతిథుల రాక..
ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌లు మహాశివరాత్రి వేడుకలకు రానున్నారు. రాష్ట్ర స్థాయి అధికారులు రానున్నట్లు సమాచారం.
ఇలా చేరుకోవాలి
రోడ్డు మార్గంలోనే వేములవాడకు చేరుకోవాలి. హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి 32 కిలోమీటర్లు దూరం రోడ్డుమార్గంలో చేరుకోవాలి. సికింద్రాబాద్ బస్టాండ్ నుంచి ప్రతీ ముప్పై నిమిషాలకో బస్సు, కరీంనగర్ నుంచి ప్రతీ పది నిమిషాలకో బస్సు సౌకర్యం ఉంది. స్థానికంగా తిప్పాపూర్ బస్టాండ్ నుంచి గుడి చెరువు వరకు 14 ఉచిత బస్సులు నడిపిస్తున్నారు.
దర్శనీయ స్థలాలు
వేములవాడ పరిసరాల్లో అనంతకోటి పద్మనాభస్వామి, భీమేశ్వరాలయం, బద్దిపోచమ్మ, నగరేశ్వరాలయం, కేదారీశ్వర, వేణుగోపాలస్వామి, నాంపల్లి గుట్టపై లక్ష్మీనర్సింహస్వామి, అగ్రహారం జోడాంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి.
అత్యవసర సేవల ఫోన్ నంబర్లు
ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి : 87126 56412
ఈవో వినోద్‌రెడ్డి : 94910 00743
వైద్యాధికారి రజిత : 70975 57119
ఆర్టీసీ డీఎం శ్రీనివాస్ : 99592 25926
టౌన్ సీఐ వీరప్రసాద్ : 87126 56413
అత్యవసర సేవలు
ఆలయం ఎదుట పోలీస్ కంట్రోల్‌రూమ్‌ను ఏర్పా టు చేశారు. నిరంతరం పోలీసు గస్తీ బృందాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అందుబాటులో ఉంచారు. ఆలయం ముందున్న అమ్మవారి కాంప్లెక్స్‌లో తాత్కాలిక వైద్యశాల, పార్కింగ్ స్థలాలు, వసతి గదుల వద్ద నిరంతరం వైద్యసేవలు అందుబాటులో ఉంచుతున్నారు. వీటిని పర్యవేక్షించేందుకు ఒక స్పెషల్ ఆఫీసర్, 13 మంది నోడల్ ఆఫీసర్లను జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా నియమించారు. వీటితోపాటుగా మొబైల్ అంబులెన్స్, ఫైర్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. 1600 మంది పోలీసుల ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment