పంటలను ముంచేసిన వరదకాల్వ బ్యాక్ వాటర్
మెట్‌పల్లిరూరల్: ఎస్సారెస్పీ వరదకాలువ బ్యాక్ వాటర్ మెట్‌పల్లి మండలం ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పొలాలను ముంచేసింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి వరదకాల్వకు రెండు రోజుల క్రితం అధికారులు 2,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆ నీటితో కాలువ నిండుగా ప్రవహిస్తోంది. జగ్గాసాగర్ శివారులోని మాన్పూరు వాగు వద్ద వరదకాల్వ.. ఆత్మకూర్ పెద్దవాగు కలుస్తాయి. వరదకాలువ నుంచి వస్తున్న నీరు పెద్దవాగుపైనుంచి ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరదకాల్వ బ్యాక్ వాటర్ పెద్దవాగు గుండా నల్ల ఒర్రె ద్వారా ఆత్మనగర్ పెద్దతండా శివారులోని పంట పొలాల్లోకి చేరుతున్నాయి. ఈ కారణంగా సుమారు 20 ఎకరాల వరకు వరి పంట నీట మునిగినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాన్పూర్ వాగు వద్ద గేట్లు ఎత్తి పెద్దవాగు దిగువ ప్రాంతానికి నీటిని వదిలితే పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందని రై తులు అంటున్నారు. అధికారులు స్పందించి తమ కు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు.
అనారోగ్యంతో మాజీ డీఈవో మృతి
ధర్మపురి: ఉమ్మడి జిల్లా మాజీ డీఈవో ఇందారపు నర్సింగరావు (95) సోమవారం అర్ధరాత్రి మృతిచెందారు. ధర్మపురికి చెందిన ఈయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈయన ధర్మపురిలోని సంస్కృతాంధ్ర కళాశాల, ఉన్నత పాఠశాల పురోగతికి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ వద్దనున్న ఓల్డ్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. నర్సింగరావు మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
అడవి పందుల దాడిలో తీవ్రగాయాలు
చందుర్తి: అడవిపందుల దాడిలో వేటగాళ్లకు తీవ్రగాయాలయిన ఘటన చందుర్తి శివారులోని బోడగుట్ట ప్రాంతంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జోగాపూర్ గ్రామానికి చెందిన సంచార జీవనం సాగించేవారితో అడవి పందుల వేటకు వెళ్లారు. అప్పటికే వారికి పంది చిక్కగా, మరో దానికోసం వేటాడుతుండగా దాడిచేసింది. ఓ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, మరో వ్యక్తికి స్వల్పంగా గాయపడినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని 108లో వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం లింగంపేట శివారులోని ఓ గుట్టకు విద్యుత్ షాక్ పెట్టి మూడు పందులను హతమార్చి మాంసాన్ని విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై అటవీశాఖ అధికారి వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం లేదని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్నారు.
పంటలను ముంచేసిన వరదకాల్వ బ్యాక్ వాటర్
Comments
Please login to add a commentAdd a comment