బడిలో మోగని వాటర్ బెల్
● డీహైడ్రేషన్ బారిన విద్యార్థులు ● నీరు తాగక అనారోగ్యంపాలు ● నీటిగంట తప్పనిసరి అంటున్న తల్లిదండ్రులు
జగిత్యాల: అసలే పదో తరగతి పరీక్షలు.. మార్కులే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. కానీ.. విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యార్థులు సరిపడా నీరు తాగకపోవడంతో తలనొప్పి, కడుపునొప్పి, నీరసం బారినపడుతున్నారు. ఇలాంటి ప్రాథమిక లక్షణాలను గుర్తించిన ప్రభుత్వం 2018లో పాఠశాలల్లో ప్రతి గంటకోసారి వాటర్ బెల్ మోగించాలని నిర్ణయించింది. కానీ.. కోవిడ్ తర్వాత దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థులు అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే ముఖ్యంగా వారికి నీరు బాగా తాగించాలని వైద్యులు చెబుతుంటారు. నీరు సరైన మోతాదులో లేకపోతే విద్యార్థులు అనారోగ్యానికి గురై ఏకాగ్రత దెబ్బతిని చదువుపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది నిపుణులు, వైద్యులు శరీరానికి సరిపడా నీరు తాగడం ప్రధానమని పేర్కొంటున్నారు.
అందని నీరు
ప్రభుత్వ పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమాన్ని 2018లో విద్యాశాఖ ప్రారంభించింది. కోవిడ్ తర్వాత మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటి నుంచి ఎవరూ దాని గురించి పట్టించుకోలేదు. విద్యార్థులు బడి సమయంలో సుమారు 1.5 లీటర్ల నీరు తీసుకుంటే మంచిదని వైద్యులు పేర్కొంటున్నారు. వయస్సును బట్టి 3 నుంచి 4 లీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ విద్యార్థులు ఉదయం ఇంటి నుంచి వాటర్‌బాటిల్ తీసుకెళ్తున్నా.. లంచ్ సమయంలో తప్ప మరెప్పుడూ తాగడం లేదు. దీంతో వారి శరీరానికి కావాల్సిన నీరు అందక ఇబ్బందికి గురవుతున్నారు. గతంలో ఫస్ట్‌బెల్, సెకెండ్ బెల్, ఇంటర్వెల్ ఇలా ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం అది మర్చిపోయారు. ఇప్పటికై నా దీనిని ఏర్పాటు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఎండకాలం మరింత తీవ్రం
ప్రస్తుతం ఎండకాలం నీరు ఎంతో అవసరం. ఒకవేళ నీరు లేకపోతే శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్‌కు లోనవుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి స్కూల్‌కు వెళ్లే సమయంలో వాటర్‌బాటిల్ తీసుకుని ప్రతి గంటకు ఒకసారి తాగాల్సి ఉంటుంది. లేదా పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరమైన తాగునీటిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
నీరు తగ్గితే వ్యాధుల పాలు
ఎండకాలంలో శరీరంలోని అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేయాలంటే మోతాదులో నీ రు తీసుకోవా ల్సిన అవసరం ఉంటుంది. నీరు ఎక్కువగా తీసుకుంటే రక్తం పలచగా మారి రక్తప్రసరన సక్రమంగా జరుగుతుంది. ఒకవేళ నీటి శాతం తగ్గితే మూత్రపిండాల్లో రాళ్లు, విద్యార్థుల్లో ముఖ్యంగా జ్వరం, మూత్రంలో ఇన్ఫెక్షన్, అసిడిటి, మలబద్ధకం, మూర్చ, కాలేయ, చర్మవ్యాధుల వంటి సమస్యలు వస్తాయి.
జిల్లాలోని చాలా పాఠశాలల్లో తాగునీటి సౌకర్యం ఉంది. అయితే గంటకోసారి నీరు తాగితే మూత్రం వస్తుందన్న కారణంతోనూ విద్యార్థులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కొన్ని పాఠశాలల్లో సరిపడా మూత్రశాలలు లేకపోవడం కూడా ప్రధాన సమస్యగా మారింది. ఈ క్రమంలో నీరు సరిపడా తాగకపోవడంతో వివిధ వ్యాధులకు గురవుతున్నారు. ఉపాధ్యాయులు వారిలో భయాన్ని పోగొట్టి ప్రతి గంటకోసారి నీరు తాగేలా చూడాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు.
భయంతో తాగని
విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment