పొలాలు ఎండిపోతున్నా పట్టదా..?
● 15 నెలలైనా ప్రాజెక్టుకు షట్టర్లు బిగించరా.. ● రైతులు మొత్తుకుంటున్నా కనికరం లేని ప్రభుత్వం ● రోళ్లవాగును పరిశీలించిన బీఆర్‌ఎస్ నాయకులు
సారంగాపూర్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి 15 నెలలవుతున్నా రోళ్లవాగు ప్రాజెక్టుకు కనీసం షట్టర్లు బిగించలేదని, ఫలితంగా ప్రాజెక్టు కింద పొలాలు ఎండిపోతున్నాయని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీర్‌పూర్ మండలంలోని రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావుతో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. 2017లో కేసీఆర్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తయ్యాయని, కేవలం అటవీశాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉందని, గేట్లు బిగిస్తే బీర్‌పూర్, ధర్మపురి మండలాల్లోని 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 15 నెలలుగా కాలయాపన చేయడం ద్వారా పంటలు ఎండిపోతున్నాయన్నారు. దీనిపై కలెక్టర్ సమీక్షించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇటీవల గోదావరిలోకి టీఎంసీ నీటిని విడుదల చేయడం ద్వారా ఎత్తిపోతల పథకం కింద పొలాలకు నీరు అందుతోందని, రానున్న రోజుల్లో నీరు అందకుంటే 50వేల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. సన్నరకాలకు రూ.500 బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటివరకు కేవలం మూడెకరాలలోపున్న కొంతమందికే రైతుభరోసా జమ అయ్యిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు నిర్ధిష్టమైన ఆలోచన లేదని, దోపిడీ కోసమే సమయం వెచ్చిస్తున్నారని విమర్శించారు. విద్యాసాగర్‌రావు మాట్లాడుతు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రాజెక్టులపై అవగాహన లేదని, విమానాలు మాత్రం నడపడం తెలుసుని ఎద్దేవా చేసారు. వారి వెంట జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ, రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment