ఓటెత్తిన చైతన్యం
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
ఉమ్మడి కరీంనగర్– మెదక్– ఆదిలాబాద్– నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి ఓటింగ్‌శాతం పెరిగింది. ఎన్నికల సంఘం చేసిన ప్రచారం, అభ్యర్థులు చేపట్టిన ఓటింగ్ నమోదు పోలింగ్‌శాతం పెరుగుదలకు దోహదం చేసింది. గురువారం నాలుగు పాత జిల్లా(కొత్త 15 జిల్లాలు)లు, 42నియోజకవర్గాల్లోని 773 పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీస్థానంలో 3,55,159 ఓట్లు ఉండగా.. 70.42శాతం పోలింగ్ నమోదైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉండగా 91.90 శాతం పోలింగ్ నమోదైంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల్లో 11.39శాతం, టీచర్లలో 8.36 శాతం పోలింగ్ మెరుగైంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఉన్న 56మంది, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోటీలో నిలిచిన 15మంది భవితవ్యం ఇప్పుడు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమై ఉంది. బ్యాలెట్ బాక్సులు కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరచగా.. మార్చి మూడో తేదీన ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ ముగిసిన నేపథ్యంలో విజయావకాశాలపై ఆన్‌లైన్ సర్వేలు జోరందుకున్నాయి.
ప్రతికూలతతో తగ్గిన ఓటింగ్..
వాస్తవానికి ఈసారి పోలింగ్ ఇంకా పెరగాల్సి ఉన్నా.. పలు ప్రతికూలతల వల్ల అది సాధ్యం కాలేదు. టీచర్లకు ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవు పేరిట రోజు మొత్తం సెలవు ఇచ్చింది. కానీ, విద్యాశాఖ, ప్రైవేటు యాజమాన్యాలు కాలడ్డం పెట్టాయి. ప్రభుత్వ స్కూళ్ల ఉపాధ్యాయులకు సగంరోజు, ప్రైవేటు వారికి గంట మాత్రమే అనుమతించారు. వాస్తవానికి టీచర్లు గ్రాడ్యుయేట్, టీచర్ రెండు ఓట్లు వేయాల్సి ఉంటంది. కానీ, సమయాభావం, సెలవు దొరక్కపోవడంతో వారిలో అధికశాతం ఒక్క ఓటుకే పరిమితమయ్యారు. దీనికితోడు ముందు రోజు రాత్రి శివరాత్రి జాగారం కావడం పలువురు పుణ్యక్షేత్రాలకు వెళ్లారు. ఇక హైదరాబాద్, తదితర నగరాలకు వలసవెళ్లిన గ్రాడ్యుయేట్లు, టీచర్లకు ఇక్కడ ఓటు ఉన్నా.. సెలవు దొరక్క, చార్జీల భారం వల్ల రాలేకపోయారు.
ఓటేసిన కలెక్టర్.. 3వ తేదీన లెక్కింపు
కరీంనగర్‌లోని ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సందర్శించారు. ముకరంపురలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆమె తన గ్రాడ్యుయేట్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఇదే పోలింగ్ కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ఓటు వేశారు. మార్చి 3వ తేదీన ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. కరీంనగర్‌లోని బీఆర్ అంబేడ్కర్ ఇండోర్ స్టేడియంలో లెక్కింపు కోసం ఏర్పాట్లు చేపడుతున్నారు. పటిష్టమైన బందోబస్తు మధ్య లెక్కింపు జరగనుంది. కొత్త 15 జిల్లాల నుంచి గురువారం అర్ధరాత్రి వరకు బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూములకు చేరుకున్నాయి. పోలింగ్ ముగిసిన మరుక్షణమే ఆన్‌లైన్‌లో ఎగ్జిట్‌పోల్ కోసం అభిప్రాయ సేకరణ ప్రారంభించారు. ఫోన్లలో ఐవీఆర్ పద్ధతిలో, నేరుగా, సోషల్‌మీడియా లేదా ఆన్‌లైన్‌లో అభిప్రాయాలు సేకరించడం మొదలు పెట్టారు.
గ్రాడ్యుయేట్ స్థానంలో పోలింగ్ ఇలా..
ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం
2019 1,95,581 59.03శాతం
2025 3,55,159 70.42శాతం
టీచర్ స్థానంలో
ఏడాది మొత్తం ఓట్లు పోలింగ్‌శాతం
2019 23,160 83.54 శాతం
2025 27,088 91.90 శాతం
రాయికల్‌లో ఓటేసేందుకు వచ్చిన మహిళలు
జగిత్యాల:జిల్లాలో అక్కడక్కడ చిన్నచిన్న సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. సారంగాపూర్ మండలంలో కొన్ని పోలింగ్ బూత్‌లలో లైటింగ్ లేక ఓటర్లు ఇబ్బంది పడ్డారు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో నంబర్లు లేకపోవడం.. చెప్పేందుకు ఎవరూ లేకపోవడంతో బూత్‌నంబర్, సీరియల్ నంబర్ల కోసం వెతక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. సెల్‌ఫోన్లో చూసుకుందామన్నా లోనికి అనుమతించకపోవడంతో మహిళ పట్టభద్రులు, ఉపాధ్యాయులు ఇబ్బందులకు గురయ్యారు. పోలీసులు కూడా ఏ బూత్ ఎక్కడో చెప్పలేకపోయారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదాలు చోటుచేసుకున్నాయి. జిల్లాకేంద్రంలోని పురాణిపేటలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలు వేసుకుని వస్తున్నారని ఆరోపణలు చేసుకున్నారు. ఎస్సై కిరణ్ సర్దిచెప్పి వారిని పంపించేశారు.
ఓటేసిన ప్రముఖులు
జగిత్యాల/జగిత్యాలటౌన్:జిల్లా కేంద్రంలోని పురాణిపేట హైస్కూల్‌లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిట్టింగ్ సీటును కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో మొదటిసారి కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి ఓల్డ్ హైస్కూల్ కేంద్రంలో ఓటేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర్‌గౌడ్ పురాణిపేట హైస్కూల్‌లో ఓటేశారు.
మెట్‌పల్లిలో ఓటేసిన ఎమ్మెల్యే సంజయ్
మెట్‌పల్లి: పట్టణంలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండల పరిషత్‌లో ఐదు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, ఉమ్మడి జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ పట్టభద్రుల ఓటు వినియోగించుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెరిగిన చైతన్యం
2019తో పోలిస్తే మెరుగుపడిన పోలింగ్
11.39 శాతం పెరిగిన పట్టభద్రులు, 8.36శాతం పెరిగిన టీచర్లు
మూడో తేదీన లెక్కింపు, ఏర్పాట్లు ముమ్మరం
విజయావకాశాలపై మొదలైన ఆన్‌లైన్ సర్వేలు
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
ఓటెత్తిన చైతన్యం
Comments
Please login to add a commentAdd a comment