ఆర్థిక క్రమశిక్షణే భవిష్యత్‌కు భరోసా
జగిత్యాల: ప్రతి ఒక్కరికి తమ ఆదాయ వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలని, ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పొదుపే భవిష్యత్‌కు భరోసా అని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్భంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక స్థితిని బట్టి ఆదాయ వ్యయాలు చేయాలని పేర్కొన్నారు. ఎదుటి వారిని చూసి ఆడంబరాలకు పోయి తమ స్థోమతకు మించి ఖర్చు చేస్తున్నారని, దీంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి సతమతమవుతున్నారని, ఆత్మహత్యలకు కూడా దారితీస్తున్నాయన్నారు. ప్రతి వ్యక్తి బడ్జెట్ రూపకల్పన చేసుకోవాలన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ రాంకుమార్ మాట్లాడుతూ, ప్రతి వ్యక్తికి సంపాదన ముఖ్యమే గానీ ఎలా ఖర్చు చేస్తున్నామన్నదే ప్రధానమన్నారు. పొదుపు చేయడానికి బ్యాంకులు, పోస్టాఫీసులు, ప్రభుత్వరంగ సంస్థలను మాత్రమే ఎంచుకోవాలని, అప్పుడే డబ్బుకు భద్రత, భరోసా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి సత్తవ్వ, బీసీ సంక్షేమాధికారి సునీత, జిల్లా ఎఫ్‌ఎల్‌సీ మధుసూదన్, మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment