సమస్య ఎక్కడుంది..?
● నీటి సమస్యకు చెక్ ● తనిఖీ చేస్తున్న సర్వే బృందం ● లీకేజీలు, పైప్‌లైన్లు, బోర్లను గుర్తిస్తున్న అధికారులు ● బల్దియాల్లో కొనసాగుతున్న ప్రక్రియ
జగిత్యాల: వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఈ మేరకు మున్సిపాలిటీల్లో ఇంజినీరింగ్ అధికారులు సర్వే చేపడుతున్నారు. ఎక్కడ నీటి సమస్యలున్నా వాటిని గుర్తించి పరిష్కరించేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో సర్వే బృందం గుర్తిస్తోంది. జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీల్లో ఎక్కడెక్కడ నీటి సమస్యలున్నాయో గుర్తించేలా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నారు. బృందంలో మున్సిపల్ కమిషనర్లతోపాటు ఏఈ, వార్డు సిబ్బంది ఉన్నారు. వీరు పూర్తి వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదిక అందించాల్సి ఉంటుంది.
సమస్యకు చెక్‌పడేనా..?
మున్సిపాలిటీల్లో నీటి సమస్యలు అనేకం ఉన్నాయి. గతంలో మిషన్ భగీరథ పైప్‌లైన్లు ఇంటింటికీ వేశారు. అయితే ప్రధాన పైప్‌లైన్‌కే లీకేజీలు ఉన్నాయి. గల్లీకో లీకేజీ ఏర్పడుతోంది. మిషన్‌భగీరథ రాకముందు వేసిన పైప్‌లైన్లకూ లీకేజీలు ఉన్నాయి. ఫలింగా మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య పెను ప్రమాదంగా మారుతోంది. లీకేజీలతో ప్రజలకు నీటి సరఫరాలో ఇబ్బంది కలగడంతోపాటు, చాలాచోట్ల బోర్లకు హ్యాండ్‌లు చెడిపోయాయి. వాటికీ మరమ్మతు చేపట్టడం లేదు. జగిత్యాలలో ప్రధాన ఫిల్టర్‌బెడ్ నుంచి నాలుగు ట్యాంక్‌లకు నీటి సరఫరా అవుతుంది. ఫిల్టర్‌బెడ్ నుంచి వచ్చే పైపులకు అనేకచోట్ల లీకేజీలు ఉన్నాయి. వేల లీటర్ల నీరు వృథాగా పోతోంది. మున్సిపల్ ఏర్పడినప్పటి పైప్‌లైన్ కావడంతో అరికట్టలేకపోతున్నామని అధికారులు పేర్కొంటున్నారు.
మిషన్ భగీరథతో అస్తవ్యస్తం
ఇంటింటికీ నీరు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. పైప్‌లైన్ కోసం ప్రతిచోట తవ్వడం, తవ్విన చోట సక్రమంగా పూడ్చకపోవడం, పాత లైన్ పూర్తిగా పగిలిపోవడం జరిగింది. దీంతో నీరంతా వృథాగా పోతోంది. ప్రతి కాలనీలో రోడ్లన్నీ బురదమయం అవుతున్నాయి. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీతో పాటు గ్రామాల్లో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. కనీసం మిషన్ భగీరథ పైప్‌లైన్ కన్నా మంచినీటి సరఫరా ఇస్తే ఇబ్బందులు ఉండవని పట్టణవాసులు కోరుతున్నారు. ప్రస్తుతం మిషన్ భగీరథ నీరును పాత పైప్‌లైన్ ద్వారానే అందిస్తున్నారు. అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్య ఎక్కడుంది..?
Comments
Please login to add a commentAdd a comment