‘బోర్డు’ వచ్చినా పెరగని ధర | - | Sakshi
Sakshi News home page

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర

Published Tue, Mar 11 2025 12:36 AM | Last Updated on Tue, Mar 11 2025 12:36 AM

‘బోర్

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర

నేటి మహాధర్నాను విజయవంతం చేయాలి

జగిత్యాలఅగ్రికల్చర్‌: వాణిజ్య పంటలైన మిర్చి.. పత్తి వంటి పంటలకు మార్కెట్లో మంచి ధర పలుకుతోంది. కానీ.. పసుపు ధరలు మాత్రం కొన్నేళ్లుగా పాతాళంలోనే ఉంటున్నాయి. పదేళ్లలో కేవలం గతేడాది ఒక్కసారి మురిపించినప్పటికీ.. ఈ ఏ డాది మళ్లీ చతికిలపడింది. చర్మసౌందర్య సాధనా ల్లో.. రంగుల పరిశ్రమల్లో.. ఔషధతయారీలో, ఆహార పరిశ్రమల్లో విరివిగా వాడే పసుపునకు దేశీ యంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉంటుంది. అయితే ఆ మేరకు ఎగుమతులు లేకపోవడంతో పసుపు పండించిన రైతులకు అనుకున్న స్థాయిలో ధర రావడం లేదు. పసుపు బోర్డు వచ్చినా రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపథ్యంలో జిల్లా రైతులు పసుపునకు గిట్టుబాటు ధర కోసం మంగళవారం మెట్‌పల్లిలో ఆందోళనకు పిలుపునిచ్చారు.

జగిత్యాల, నిజామాబాద్‌లదే అగ్రస్థానం

పసుపు పంట సాగు, ఉత్పత్తిలో జగిత్యాలతోపాటు నిజామాబాద్‌దే అగ్రస్థానం. రాష్ట్రం మొత్తంగా 1.10 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాలోనే దాదాపు 60 వేల ఎకరాల్లో సాగవుతోంది. జిల్లా రైతులు పసుపు పంటను ఇంటిపంటగా భావిస్తుంటారు. ధర ఉన్నా.. లేకున్నా సాగు చేస్తున్నారు. పసుపు 9నెలల పంట కావడంతో ఈ పంటకు వచ్చే ఆదాయంపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో బరువైన నేలలు ఉండడం.. అవి పసుపు పంటకు అనుకూలంగా కావడంతో డ్రిప్‌, సేంద్రియ ఎరువులు వాడుతూ మంచి దిగుబడి సాధిస్తున్నారు. పసుపు రంగు, నాణ్యత బాగానే ఉన్నప్పటికీ.. ఇక్కడి రైతులు పండించిన పసుపులో కుర్కుమిన్‌ శాతం తక్కువగా ఉందనే ఒక అపవాదు ఉంది.

ఈసారి దిగుబడి అంతంతే..

ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా ఉండటంతో పసుపు పంట దెబ్బతింది. ముఖ్యంగా ఎక్కువరోజులపాటు పంటలో నీరు నిల్వ ఉండటంతో పసుపు పంట మొక్కలు చనిపోయాయి. దుంపకుళ్లు రోగం వచ్చి దిగుబడి తగ్గింది. ఎకరాకు 35 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుందనుకుంటే కనీసం 15 నుంచి 20 క్వింటాళ్లు కూడా రాలేదు. ఒక్కో రైతు ఎకరాకు లారీ పశువుల లేదా కోళ్ల ఎరువుకు రూ.30వేల వరకు ఖర్చు పెట్టారు. కలుపుతీత, ఎరువులకు మరో రూ.30 వేలు, పంట తవ్వకం, కొమ్ములు విరవడం, ఉడకబెట్టేందుకు ఇంకో రూ.40వేలు.. ఇలా దాదాపు ఎకరాకు రూ.లక్ష వరకు ఖర్చు పెట్టినా ఆ స్థాయిలో దిగుబడి రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మార్కెట్‌లో ధరలు అంతంతే..

గతేడాది పసుపు పంట క్వింటాల్‌కు రూ.17వేల నుంచి రూ.18వేలు పలికింది. దీంతో ఈ ఏడాది జిల్లాలో మరో 10వేల ఎకరాల సాగు పెరిగింది. పండించిన పసుపును రైతులు నిజామాబాద్‌, వరంగల్‌ మార్కెట్లతోపాటు తమిళనాడులోని ఇరోడ్‌, సేలం, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్‌కు తీసుకెళ్తుంటారు. అక్కడ ధర క్వింటాల్‌కు కేవలం రూ.8వేల నుంచి రూ.10 వేలు, మండ పసుపునకు రూ.7వేల నుంచి రూ.8వేలు మాత్రమే పలుకుతోంది. ఫలితంగా పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అన్నదాతల పోరుబాట

నిజామాబాద్‌ కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పడినప్పటికీ రైతుల పోరాటాలు మాత్రం ఆగడం లేదు. పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర ప్రకటించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పసుపు పండించే గ్రామాల్లో వారం రోజులుగా పర్యటించి ఈనెల 11న మెట్‌పల్లిలో జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుతున్నారు.

గతేడాది క్వింటాల్‌కు రూ.17వేల నుంచి రూ.18వేలు

ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8వేల నుంచి రూ.10వేలు

పెట్టుబడులు కూడా నష్టపోతున్న అన్నదాతలు

గిట్టుబాటు ధర కోసం ఆందోళనకు రైతుల కార్యాచరణ

నేడు మెట్‌పల్లిలో ధర్నాకు రైతు ఐక్య వేదిక పిలుపు

ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

మెట్‌పల్లి: పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో పసుపు కొనుగోళ్లను సోమవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంటకు వ్యాపారులు చెల్లిస్తున్న ధరపై ఆరా తీశారు. పసుపునకు గిట్టుబాటు ధర అందక రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వచ్చే సీజన్‌లో పసుపు రైతులు కోటీశ్వరులు అవుతారని మాట్లాడిన నాయకులు.. ఇప్పుడు అందుతున్న ధరలపై రైతులకు సమాధానం చెప్పాలని కోరారు. బోర్డు పేరుతో కేంద్రం రూ.15వేల మద్దతు ధర ఇస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం పసుపు రైతులను మోసం చేస్తున్నాయన్నారు. మెట్‌పల్లిలో పసుపు రైతులు తలపెట్టిన మహాధర్నా విజయవంతం చేయాలని కోరారు.

మూడెకరాల్లో సాగు చేశాను

మూడెకరాల్లో పసుపు పంట వేశాను. గతేడాది రేటు మంచిగా ఉండే. ఈ ఏడాది అదనంగా మరో ఎకరం ఎక్కువగా వేశాను. దిగుబడి అనుకున్న స్థాయిలోనే వచ్చింది. మార్కెట్‌ ధర పెరిగిన పెట్టుబడికి ఏ మాత్రమూ గిట్టుబాటు కావడం లేదు. గతేడాదితో పోల్చితే రూ.లక్ష వరకు నష్టం వస్తోంది.

– ఏలేటి మహేశ్‌ రెడ్డి,

కొత్తధాంరాజ్‌పల్లి, మల్లాపూర్‌

క్వింటాల్‌కు రూ.15వేలు చెల్లించాలి

పసుపు క్వింటాల్‌కు రూ.15 వేల మద్దతు ధర చెల్లించాలని కొన్నేళ్లుగా పోరాడుతున్నాం. ధర రానప్పుడు బోర్డు ఏర్పడినా.. ఏం ఉపయోగం లేదు. కష్టానికి తగిన ఫలితం వస్తేనే రానున్న రోజుల్లో సాగు చేస్తారు. రేటు పెరుగుతుందనే ఆశతోనే పసుపును సాగు చేస్తున్నాం.

– న్యావనంది లింబారెడ్డి, మల్లాపూర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
‘బోర్డు’ వచ్చినా పెరగని ధర1
1/3

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర2
2/3

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర3
3/3

‘బోర్డు’ వచ్చినా పెరగని ధర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement