
పాలన వైఫల్యంతో ప్రజలకు ఇబ్బందులు
మల్లాపూర్: కాంగ్రెస్ పాలన వైఫల్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనపై దృష్టి సారించకుండా బీఆర్‌ఎస్‌ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని, 15 నెలల పాలనలో తెలంగాణ ఐదేళ్లు వెనక్కి వెళ్లిందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమానికి కొట్లాడుతానన్నారు. పథకాలు మంజూరు చేయిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలిసిందని, అలాంటివారి చెంప చెల్లుమనిపించాలని సూ చించారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ కాటిపెల్లి సరోజన, మాజీ వైస్ ఎంపీపీ గౌరు నాగేష్, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, నాయకులు పాల్గొన్నారు.
రోగులకు మెరుగైన సేవలు అందించాలి
మెట్‌పల్లి: ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే సంజయ్ సిబ్బందికి సూచించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో మాట్లాడారు. కొత్త భవన నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, నిధులు త్వరలోనే వస్తాయని తెలిపారు. మందుల కొరత ఉందని సిబ్బంది చెప్పగా.. సంబంధిత అధికారితో ఫోన్‌లో మాట్లాడి తెప్పించాలని సూచించారు.