
ప్రమాద బాధితుడి వైద్యానికి రూ.1.27లక్షల సాయం
ధర్మపురి: రోడ్డు ప్రమాదానికి గురై.. కాలు విరిగి.. వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన ఓ నిరుపేద యువకుడికి వైద్యం కోసం ఫేస్‌బుక్ మిత్రులు రూ.1.27 లక్షలు విరాళాలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా చిత్తూరు జిల్లా కేంద్రానికి చెందిన కొన నిరంజన్‌బాబు ఉపాధికోసం నాలుగేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఓ ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రులు చిన్నతనంలో చనిపోయారు. ఒంటరిగానే ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో రైల్వే స్టేషన్‌కు వెళ్తుండగా ప్రమాదానికి గురై కాలు విరగడంతోపాటు వెన్నెముకకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమయ్యాడు. తన స్నేహితుల సహకారంతో వైద్యం చేయించుకున్నాడు. మరో రెండు నెలలు వైద్యం చేయించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నిరంజన్‌బాబు వైద్య ఖర్చులు భరించలేని స్థితిలో ఉన్నాడు. బాధితుడి పరిస్థితిని తెలుసుకున్న ధర్మపురికి చెందిన సామాజిక సేవకుడు రేణికుంట రమేశ్ నిరంజన్‌బాబు వైద్యానికి సాయం చేయాలని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. స్పందించిన ఎన్నారైలు, ఇతర దాతలు బాధితుడి బ్యాంకు ఖాతాకు రూ.1.27 లక్షలు విరాళాలుగా పంపించారు. దాతలు అందించిన విరాళాలతో నిరంజన్‌బాబుకు వైద్య సేవలు కొనసాగిస్తున్నట్లు రమేశ్ తెలిపాడు.
● ఎల్లలు దాటిన ఔదార్యం