
విద్యుత్ ప్రమాదాల నివారణకు ‘లైన్‌క్లియర్’
సారంగాపూర్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు ప్రమాదాల నివారణకు కొత్త యాప్‌కు రూపకల్పన చేసినట్లు ఎన్‌పీడీసీఎల్ జిల్లా ఎస్‌ఈ సాలియా నాయక్ తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో విద్యుత్ లైన్‌లో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఎల్‌సీ (లైన్ క్లియర్) తీసుకోవడంలో కొన్నిసార్లు మానవ తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయి. ఓ లైన్ ఫీడర్‌కు ఇచ్చే ఎల్‌సీకి బదులు మరో లైన్ ఫీడర్‌కు ఇచ్చినప్పుడు సమాచార లోపంతో ప్రమాదాలు జరుగున్నాయి. విద్యుత్ సిబ్బంది గాయపడడం, కొన్నిసార్లు మరణాలు సంభవిస్తున్నాయి. ఇలాంటి వాటిని నివారించడానికి లైన్‌క్లియర్ యాప్‌ను రూపొందించినట్లు ఎస్‌ఈ తెలిపారు. ఈ యాప్ లైన్‌మెన్ ఓపెన్ చేసి ఏఈకి ఏ లైన్ ఫీడర్‌కు ఎల్‌సి కావాలో మెసేజ్ చేస్తారు. ఏఈ ఎల్‌సీ లైన్ పరిస్థితిని సమీక్షించి ఎల్‌సీ ఇవ్వవచ్చా..? లేదా..? అని సబ్‌స్టేషన్‌లోని ఆపరేటర్‌తో కాంటాక్ట్‌కు వెళ్తుంది. లైన్ పరిస్థితి, ఏ ఫీడర్ తదితర అంశాలను హెచ్చరిస్తూ ఆపరేటర్ ఏఈకి సమాచారం ఇస్తే అక్కడి నుంచి లైన్‌మన్‌కు సమాచారం వస్తుంది. ఇది పూర్తి ఆధునిక సాంకేతికతో రూపొందించామని తెలిపారు. ఆయన వెంట ఏడీఈ సింధూశర్మ, సారంగాపూర్, బీర్‌పూర్ ఏఈలు ప్రవీణ్, శ్రీనివాస్ ఉన్నారు.