
ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య
పాలకుర్తి(రామగుండం): ఇంటర్ పరీక్షలో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఘనశ్యాందాస్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. సాపల్ల ఎల్లయ్య– గంగమ్మ దంపతుల కూతురు శశిరేఖ(17) సిరిసిల్లలోని మోడల్ స్కూల్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఇటీవల పరీక్షలు రాసింది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో కామర్స్ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది. శశిరేఖ తలి గంగమ్మ ఉదయమే పనికోసం పెద్దపల్లికి, తండ్రి ఎల్లయ్య క్వారీ పనికి వెళ్లాడు. శశిరేఖ ఒంటరిగా ఉన్నది. మనస్తాపంతో ఇంట్లో ఉరేసుకుంది. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చిచూసేసరికి విగతజీవిగా కనిపించడంతో బోరున విలపించారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె. ఇద్దరు కుమారులలో ఒకరు బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు. మరో కుమారుడికి ఇటీవలే నేవీలో ఉద్యోగం రాగా శిక్షణ నిమిత్తం కేరళలో ఉంటున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై స్వామి తెలిపారు.
బావిలో దూకి మహిళ ఆత్మహత్య
బుగ్గారం: జీవితంపై విరక్తితో వ్యవసాయ బావిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుగ్గారం మండలం గంగాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల, పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కట్ట గంగమ్మ (61) కొంతకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతోంది. జీవితంపై విరక్తి చెంది ఇంటికి సమీపంలోని ఓ వ్యవసాయబావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె కుమారుడు కట్ట తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గంగమ్మకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
అత్యాచారయత్నం కేసులో రెండేళ్ల జైలు
జగిత్యాలజోన్: మహిళపై అత్యాచారయత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జగిత్యాల మొదటి అదన పు జిల్లా జడ్జి సుగళి నారాయణ మంగళవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కాసారపు మల్లేశం కథనం ప్రకారం.. జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళను భర్త వదిలివెళ్లిపోవడంతో పిల్లలతో కలిసి కిరాణం షాఫు పెట్టుకుని జీవిస్తోంది. 2019 మే9న రాత్రి భోజనం చేసి తన పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో సొంత చిన్న మామ అయిన బోద్దుల రాజేందర్ కిటికికి ఉన్న దోమ తెరను కత్తిరించుకుని అక్రమంగా మహిళ ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నానికి ప్రయత్నించాడు. సదరు మహిళ అరవడంతో పక్కింటి వారు వచ్చేసరికి రాజేందర్ అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు కె.నరేష్, బి.రాజునాయక్ సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టారు. పరిశీలించిన జడ్జి బొద్దుల రాజేందర్‌కు రెండేళ్ల జైలు, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.

ఇంటర్‌లో ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో ఆత్మహత్య