సాక్షిప్రతినిధి, వరంగల్: రాజకీయ ఉద్ధ్దండులకు కేరాఫ్ అయిన వరంగల్‌లో రోజుకో తీరు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి మూడు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాజకీయాలు కీలకంగా మారాయి. దరఖాస్తులు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూస్తుండగా.. ముందుగానే టికెట్ ఖరారు చేసుకున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులు కొందరు వ్యూహరచన, ప్రచారాల్లో పడ్డారు. ఇదే సమయంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో చెలరేగిన అసంతృప్తి మాత్రం సద్దుమణగడం లేదు. ఉమ్మడిజిల్లాలో 12 స్థానాల్లో పది చోట్ల ప్రశాంతంగా ఉన్నా.. ఈ రెండు స్థానాలు మాత్రం అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. అందరి దృష్టి ఇప్పుడు ఆ నియోజకవర్గాలపైనే ఉంది.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు మంతనాలు జరిపినా.. ఆరెండు నియోజకవర్గాల్లో అసంతృప్తి.. అంతర్గత కుమ్ములాటలు సద్దుమణగడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కడియం శ్రీహరి ఎవరికీ వారుగానే వ్యవహరిస్తున్నారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారం రోజుల కిందట బీఆర్‌ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్‌కు పిలిపించారు. స్టేషన్ ఘన్‌పూర్‌కు సంబంధించి ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరితో వేర్వేరుగా, కలిపి మంత్రి కేటీఆర్ చాలాసేపు చర్చలు జరిపారు.
ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ ప్రయోజనాలు, అవకాశాలపై కూలంకుషంగా మాట్లాడిన అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో రాజయ్య, శ్రీహరి కరచాలనం చేసుకున్నారు. అప్యాయంగా పలకరించుకున్న ఫొటోలు, వీడియోలు మీడియాలో రావడంతో అంతా సద్దుమణిగినట్లేననుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి చేయి కలిపితే పోటీ చేయకుండా ఉంటానన్నట్లా అంటూ రాజయ్య, శ్రీహరి ఎవరికి వారుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని బుజ్జగించేందుకు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు.
పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా ప్రగతిభవన్‌లోనే ఉన్నప్పటికీ కేటీఆర్.. ఎమ్మెల్యే యాదగిరిరెడ్డితోనే మాట్లాడారు. తర్వాత సీఎం కేసీఆర్‌ను కూడా కలిసినట్లు యాదగిరిరెడ్డి చెప్పారు. ఇది జరిగిన మరుసటి రోజు నుంచే ఎమ్మెల్యే జనగామలో తిరుగుతుండగా.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సైతం నియోజకవర్గంలోని తన అనుచరులతో వ్యూహ రచనలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందటి కంటే ఎక్కువగా ఒకరిపై ఒకరు పరోక్ష వ్యాఖ్యలు, విమర్శలు చేసుకుంటుండడంతో పార్టీ క్యాడర్ ఇబ్బంది పడుతోంది.
కేటీఆర్ పర్యటనతోనైనా సద్దుమణిగేనా..
ప్రయత్నాలెన్ని చేసినా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ రాజకీయాలు ఇంకా రక్తి కట్టడం లేదు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య అగాధం రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. అంతా అయిపోయిందనుకున్న స్టేషన్ ఘన్‌పూర్‌లో సైతం పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉంది. మరో ఐదారు రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు సైతం అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటిస్తాయన్న ప్రచారం జోరందుకుంది. ఆమేరకు కూడా ఆరెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు కావొస్తున్నా.. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ కుదురుకోవడం లేదు.
పైగా.. ఆ ప్రభావం ఇతర నియోజకవర్గాలపైనే చూపే అవకాశం లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో నేతల మధ్య విభేధాలతో ‘ఎవరి వెంట వెళ్లాలో.. ఎవరితో వెళ్లకూడదో అర్థం కావడం లేదని.. అధిష్టానం తొందరగా సెట్ చేస్తేనే కలిసి తిరగగలం’ అని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈనెల 6న మంత్రి కేటీఆర్ వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ఆయన ఉమ్మడి వరంగల్ రాజకీయాలపై సమీక్ష జరిపే అవకాశం ఉందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాల్లో నేతల వివాదాలకు సైతం సీరియస్‌గానే తెర వేయనున్నారన్న చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment