భద్రత.. భారీగా | - | Sakshi
Sakshi News home page

భద్రత.. భారీగా

Published Tue, Feb 11 2025 1:34 AM | Last Updated on Tue, Feb 11 2025 1:34 AM

భద్రత

భద్రత.. భారీగా

మినీ మేడారానికి పటిష్ట బందోబస్తు

విధులకు వెయ్యి మంది పోలీసులు

బుధవారం నుంచి ఆదివారం వరకు

డేగకళ్లతో నిఘా

జాతరకు పోలీసు శాఖ ఏర్పాట్లు పూర్తి

ములుగు: ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం మేడారంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న మినీ జాతరకు భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే రోజు వారీగా 60 నుంచి 100 మంది బందోబస్తు చేపడుతుండగా బుధవారం జరిగే మండమెలిగె నుంచి మినీ జాతర పూర్తయ్యే వరకూ జిల్లాలోని తొమ్మిది మండలాల్లో విధులు నిర్వర్తిస్తున్న సివిల్‌, ఏఆర్‌, సీఆర్పీఎఫ్‌ నుంచి వెయ్యి మందికి ఎస్పీ శబరీశ్‌ డ్యూటీలు కేటాయించారు. ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌ పర్యవేక్షణ చేస్తున్నారు. వచ్చే ఆదివారం వరకు భద్రతాచర్యలు కొనసాగనున్నాయి. షిప్టుల వారీగా కేటాయించే విధులకు ఓఎస్డీ మహేశ్‌ బాబాసాహెబ్‌ గితే, ట్రాఫిక్‌ కంట్రోల్‌కు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ, ట్రాఫిక్‌ పర్యవేక్షకులుగా ఏటూరునాగారం సీఐ శ్రీనివాస్‌, ములుగు సీఐ శంకర్‌ వ్యవహరించనున్నారు. ఇక ఆలయ ప్రాంతంలో అడిషనల్‌ ఎస్పీ (ఏఆర్‌) సదానందం, డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్‌ బందోబస్తు చేపడుతారు. ములుగు డీఎస్పీ రవీందర్‌, పస్రా సీఐ రవీందర్‌ పర్యవేక్షణ చేయనున్నారు.

స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, గద్దెల ప్రాంగణంలో మహిళా సిబ్బంది..

జంపన్నవాగుపై ఏర్పాటు చేసిన స్నానఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, అమ్మవార్లను దర్శించుకునే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మహిళా ఎస్సైలు, కానిస్టేబుళ్లుకు విధులు కేటాయించారు. సుమారు 60 నుంచి 100 మందికి షిప్టుల వారీగా డ్యూటీలు కేటాయించారు. ఇక చోరీలు, పిక్‌ప్యాకెటింగ్‌, అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి బ్లూకోల్ట్స్‌తో పాటు ప్రత్యేక సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు.

జాతరకు ఏర్పాట్లు పూర్తి

మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఈ సారి వెయ్యి మందితో ట్రాఫిక్‌, శాంతిభద్రతలను పర్యవేక్షించనున్నాం. భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని షిప్టుల వారీగా సిబ్బంది సంఖ్య పెంచుతాం. భక్తుల సౌకర్యార్థం ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు, రూట్‌ మ్యాప్‌ల సైన్‌ బోర్డులను ఏర్పాటు చేశాం. జంపన్నవాగుపై స్థలం తక్కువ ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఆగే భక్తులు కొంత సమన్వయంతో వాహనాలను క్రమపద్ధతిలో పార్క్‌ చేసుకోవాలి. ఎవరికై నా సమస్య తలెత్తితే బందోబస్తులో ఉన్న పోలీసు అధికారుల సాయం కోరాలి.

– డాక్టర్‌ శబరీశ్‌, ఎస్పీ, ములుగు

No comments yet. Be the first to comment!
Add a comment
భద్రత.. భారీగా1
1/1

భద్రత.. భారీగా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement