కార్యదర్శులు అప్పులపాలు! | - | Sakshi
Sakshi News home page

కార్యదర్శులు అప్పులపాలు!

Published Wed, Feb 19 2025 1:01 AM | Last Updated on Wed, Feb 19 2025 12:58 AM

కార్య

కార్యదర్శులు అప్పులపాలు!

జనగామ/జనగామ రూరల్‌: అస్తవ్యస్తంగా డ్రెయినేజీలు.. కంపుకొడుతున్న పల్లెలు... అంధకారంలో వార్డులు... మూలన పడుతున్న ట్రాక్టర్లు... పేరుకుపోతున్న చెత్తడంపులు ఇవీ జిల్లాలోని గ్రామాల్లో నెలకొన్న దుస్థితి. సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసి ఏడాది గడిచి పోతున్నా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకపోవడంతో కేంద్ర, రాష్ట ప్రభుత్వాల నుంచి గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు నిలిచిపోయాయి. ఇంటి, నల్లా పన్నులకు సంబంధించి ట్రెజరీలో ఫ్రీజింగ్‌ విధించడంతో.. భారమంతా సెక్రటరీలపై పడుతుంది. స్పెషలాఫీసర్లు కేవలం పర్యవేక్షణ మాత్రమే చేస్తుండగా... కార్యదర్శులు సొంతంగా అప్పులు తీసుకు వచ్చి జీపీల నిర్వహణను నెట్టుకువస్తున్నారు. జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌గా ప్రమోట్‌ కాగా దాని పరిధిలో శివునిపల్లి, ఛాగల్‌ జీపీలను విలీనం చేయడంతో జిల్లాలో 280 గ్రామ పంచాయతీలకు కుదించబడ్డాయి. 2023–24 వార్షిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.33.88 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం స్టేట్‌ ఫైనాన్స్‌ ద్వారా రూ.5.98 కోట్లు మొత్తంగా రూ.39.87 కోట్ల బడ్జెట్‌ రిలీజ్‌ చేసింది. 2024 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి జీపీ పాలక మండళ్ల గడువు ముగిసి పోవడంతో 2025–26 సంవత్సరంలో బడ్జెట్‌కు సంబంధించి పైసా రాలేదు.

నిలిచిన చెల్లింపులు

జిల్లాలోని జీపీలకు గతేడాది ఆగస్టు మాసం నుంచి బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. పాలకవర్గం (సర్పంచ్‌/వార్డు సభ్యులు) కాల పరిమితి ముగిసిన నాటి నుంచి జీపీల నిర్వహణ బాధ్యత పూర్తిగా కార్యదర్శులపై పడింది. పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన ట్రాక్టర్‌ డీజిల్‌, మరమ్మతు, బ్లీచింగ్‌, దోమల నివారణ కోసం బయోటెక్స్‌, ఫాగింగ్‌, పారిశుద్ధ్య సామగ్రి, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణకు అప్పులు చేసి పనులు చేయిస్తున్నారు. ఇంటి, నల్లా, అనుమతి ఇతర పద్దుల ద్వారా జీపీకి వచ్చే ఆదాయ వనరులను జీపీ అకౌంట్‌ (టెజరరీ ద్వారా/ఐఎఫ్‌ఎంఎస్‌)లో జమ చేస్తున్నారు. ట్రెజరరీ అకౌంట్‌ ఫ్రీజింగ్‌ చేయడంతో అందులో డబ్బులు వేయడమే తప్ప, తీసుకునే వీలు లేకుండా పోయింది. దీంతో గతేడాది ఆగస్టు మాసం నుంచి పంచాయతీ కార్యదర్శులు ఖర్చు చేసిన లక్షలాది రూపాయలు పెండింగ్‌లో ఉన్నాయి. రోజు వారి నిర్వహణకు ప్రతీ నెల చిన్న పంచాయతీలకు రూ.లక్షకు పైగా, మేజర్‌ జీపీల్లో రూ. 2 లక్షలవరకు సెక్రటరీలు సొంతంగా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే పలు జీపీల్లో ట్రాక్టర్లు మూలన పడడంతో చెత్తను ఎ క్కడ పడితే అక్కడే వేస్తున్నారు. బిల్లులు చెల్లించా లని జనగామ మండలానికి చెందిన కార్యదర్శులు ఇటీవల ఎంపీడీఓకు వినతిపత్రం అందించారు.

సొంతంగా ఖర్చు చేసుకునే స్థోమత లేదు..

పంచాయతీల నిర్వహణకు టీఎస్‌బీపాస్‌ ద్వారా డబ్బులు విడుదల చేసుకునే అవకాశం కల్పించాలి. నిధుల లేమితో అభివృద్ధి కుంటుబడుతోంది. కార్యదర్శులు సైతం సొంతంగా ఖర్చు చేసుకునే స్థోమత లేకుండా పోతుంది.

– దామెర వంశీ, కార్యదర్శుల సంఘం

మండల అధ్యక్షుడు, నర్మెట

ప్రతీ నెల రూ.60 వేల ఖర్చు

పద్నాలుగు నెలలుగా బిల్లులు రావడం లేదు. కనీస అవసరాలకు ఆయా దుకాణదారుల్లో చేసిన అప్పులతో రోడ్డెక్కితే ముఖం చాటేయాల్సి వస్తోంది. నిత్యం శానిటేషన్‌ పనులు, ట్రాక్టర్‌ డీజిల్‌, తాగునీటి మోటారు, పైపులైన్‌ మరమ్మతు తదితర అత్యవసర పనులకు ప్రతీ నెల రూ.60 నుంచి రూ.90 వేల ఖర్చు చేస్తున్నాం.

– జిలుకర వెంకన్న, జీపీ కార్యదర్శి, దేవరుప్పుల

పంచాయతీ నిర్వహణకు సొంత డబ్బులు

గత ఆగస్టు నుంచి బిల్లుల పెండింగ్‌

ఎలక్షన్లు జరిపితేనే సర్కారు నుంచి నిధులు

మూలన పడుతున్న ట్రాక్టర్లు

కంపుకొడుతున్న గ్రామాలు

ఆగమాగంగా వీధిలైట్ల నిర్వహణ

పంచాయతీ పాలన కష్టమే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక, ట్రెజరీ నుంచి విడిపించుకోలేని పరిస్థితుల్లో ఏడాదిగా ఆర్థిక భారాన్ని మోస్తున్నాం. వీధి దీపాలు, డీజిల్‌, బోరు మోటార్ల నిర్వహణ, పారిశుద్ధ్యం నిర్వహణ ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నాం. అధికారులు స్పందించి నిర్వహణ ఖర్చులను విడుదల చేయాలి.

– పన్నీరు మధుసూదన్‌, సెక్రటరీ,

చిల్పూరు, వెంకటేశ్వరపల్లి

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం..

పంచాయతీలకు పెండింగ్‌లో ఉన్న బిల్లులు విడుదల చేయాలని కార్యదర్శులు తమకు వినతి చేస్తున్నారు. ఇంటి, తదితర పన్నులు ట్రెజరీలో వేసిన తర్వాత, డ్రా చేసుకునే అవకాశం లేదు. దీంతో టీఎస్‌బీపాస్‌ ద్వారా డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాం.

– నాగపురి స్వరూప, డీపీఓ

No comments yet. Be the first to comment!
Add a comment
కార్యదర్శులు అప్పులపాలు!1
1/5

కార్యదర్శులు అప్పులపాలు!

కార్యదర్శులు అప్పులపాలు!2
2/5

కార్యదర్శులు అప్పులపాలు!

కార్యదర్శులు అప్పులపాలు!3
3/5

కార్యదర్శులు అప్పులపాలు!

కార్యదర్శులు అప్పులపాలు!4
4/5

కార్యదర్శులు అప్పులపాలు!

కార్యదర్శులు అప్పులపాలు!5
5/5

కార్యదర్శులు అప్పులపాలు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement