ప్రమాదం మాటున ‘సెల్లార్’ బిజినెస్
అనుమతి లేకున్నా విచ్చలవిడిగా వ్యాపారాలు
కస్టమర్ల రక్షణకు చర్యలు శూన్యం..?
వరుస అగ్ని ప్రమాదాలు..
అయినా దృష్టి పెట్టని అధికార యంత్రాంగం
భవనాల్లో సెల్లార్ల నిర్మాణం.. వాటి వినియోగంలో యజమానులు నిబంధనల ను తుంగలో తొక్కుతున్నారు. పురపాలిక అధికారుల నిర్లక్ష్యం.. అగ్నిమాపక శాఖ అలసత్వం రెండూ కలిసి అమాయక ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతోంది. జిల్లా కేంద్రంలో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా.. ఆ క్షణం ఆగమాగం చేయడం.. తర్వాత గాలికి వదిలేస్తున్నారు. అనుమతి లేకుండా సెల్లార్లు అడ్డగోలుగా నిర్మించడంతో పాటు వాటిలో వ్యాపారాలు సాగిస్తున్నారు. వినయకృష్ణారెడ్డి కలెక్టర్ గా ఉన్న సమయంలో పలు సెల్లార్లను మూసివేయించగా.. ఆ తర్వాత వచ్చిన వారు పట్టించుకునన్న దాఖలాలు లేవు.. - జనగామ
జనగామ పట్టణంలోని నెహ్రూపార్కు, బస్టాండ్ చిన్నగేటు, స్వర్ణకళామందిర్, హైదరాబాద్‌రోడ్డు, పెట్రోల్‌పంపు గల్లీ తదితర ప్రాంతాల్లో సెల్లార్లను వ్యాపార, వాణిజ్య సంస్థలకు అద్దెకు ఇచ్చారు. మొదట కొన్ని రోజుల పాటు పార్కింగ్ కోసం వదిలేసి.. ఆ తర్వాత రెంటుకు ఇచ్చేస్తున్నా రు. గత ఏడాది విజయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్స్, ఇటీవల జై భవానీ ఎలక్ట్రిక్ హార్డ్ వేర్‌లో ప్రమాదవ శాత్తు మంటలు అంటుకుని రూ.కోట్లలో నష్టం వాటిల్లింది.
ఈ రెండు సంఘటనలు తెల్లవారుజాము, రాత్రి జరగడంతో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. ఓపెన్‌గా ఉన్న దుకాణాల్లో మంటలు చెలరేగితేనే అదుపులోకి తీసుకు వచ్చేందుకు గంటల సమయం పట్టింది. ఒక వేళ సెల్లార్లలో మంటలు చెలరేగితే పరిస్థితి ఏమిటనే ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. ఒక్క జిల్లా కేంద్రంలోనే 20 నుంచి 50 వరకు సెల్లార్లు ఉండగా, అన్నింట్లో వ్యాపారాలు నడుస్తున్నాయి. సెల్లార్లలో కస్టమర్లు ఉన్న సమయంలో ప్రమాదం జరిగితే వారిని తప్పించేందుకు ఎమ్జెన్సీ ఎగ్జిట్ సైతం ఉండదు. స్వర్ణ కళామందిర్ రూట్‌లో ఫైర్ ఇంజన్ వెళ్లే పరిస్థితి లేదు. అంతటి ఇరుకైన స్థలంలో సెల్లార్ల వ్యాపారం ఎంతటి డేంజరో అర్థం చేసుకోవచ్చు.
ఫైర్ సేఫ్టీపై కొత్త జీఓ
గతంలో 15 ఫీట్ల ఎత్తులో ఉన్న భవనాలకు మాత్రమే ఫైర్ సేఫ్టీ ఉండాలనే నిబంధన ఉండగా.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 డిసెంబర్ 17వ తేదీన కొత్త జీఓ తీసుకు వచ్చింది. వ్యాపార, వాణిజ్య సంస్థలతో పాటు ప్రతీ షాపింగ్ మాల్‌కు ఫైర్ సేఫ్టీ తప్పనిసరి ఉండాలని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు అగ్నిమాపక శాఖ ఫాం 9 నోటీసుతో ఆయా వ్యాపార సంస్థలను తనిఖీ చేసి, నిబంధనల మేరకు ఫైర్ సేఫ్టీ లేని వారికి ఫాం 12 నోటీసు జారీ చేశారు. కాటన్, రైస్ మిల్లులతో పాటు వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు, అసోసియేషన్ల ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. నెల రోజుల సమయం ఇచ్చి.. అప్పటికీ స్పందించకుంటే ఫాం 14 ద్వారా డీజీకి అటాచ్ చేస్తారు. అక్కడి నుంచి కోర్టు ద్వారా సదరు వ్యాపార సంస్థలకు జరిమానా లేదా తదుపరి చర్యలు తీసుకుంటారు. అయితే పట్టణంలో మాత్రం ఇప్పటి వరకు జరిమానా, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని తెలుస్తున్నది. ఇదిలా ఉండగా అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సెల్లార్లపై ఎవరూ నోరు మెదపడం లేదు.
ప్రమాదానికి హేతువు..
హైదరాబాద్‌రోడ్డు పెట్రోల్‌పంపు గల్లీలోని సెల్లార్లలో ఇళ్లకు వేసే రంగులు, పీఓపీ, ఫోమ్, ఫైబర్, వైరింగ్ మెటీరియల్, స్వర్ణకళామందిర్ రోడ్డులో గిఫ్ట్ ఆర్టికల్స్, చైనా మాల్, ప్లాస్టిక్ గూడ్స్ విక్రయాలు జరుగుతాయి. ఇవి అత్యంత ప్రమాదరకమైనవి. అంటుకుంటే ఆర్పడం కష్టమే.
అధికారులకే తెలియదట..
నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్ల నిర్మాణం జరుగుతున్నా పురపాలిక అధికారులు చోద్యం చూస్తున్నారు. అనుమతులు లేకుండా సెల్లార్లలో వ్యాపారం చేస్తున్నా.. కనీసం నోటీసులు సైతం ఇవ్వడంలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పర్యవేక్షించాల్సిన ఓ ఉన్నతాధికారిని అడిగితే పట్టణంలో సెల్లార్లు ఉన్నాయా.. ఉంటే అందులో వ్యాపారాలు కూడా చేస్తున్నారా అంటూ రివర్స్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment