అరకొర.. అసంపూర్తి
జిల్లాలో జాతీయ రహదారి–143 పనుల విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామాల్లో సర్వీస్‌రోడ్లు,
సైడ్ రెయిలింగ్‌లు, డ్రెయినేజీ పనులు
అరకొర.. అసంపూర్తిగా ఉన్నాయి. గడువు ముగిసి ఆరేళ్లయినా పనుల పూర్తికి మోక్షం లభించడంలేదు. ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. – స్టేషన్‌ఘన్‌పూర్
● ఎన్‌హెచ్–143 పనులు ఆగమాగం
● గడువు ముగిసి ఆరేళ్లయినా
పూర్తికాని సర్వీసు రోడ్ల నిర్మాణం
● రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న ప్రజలు
● పట్టింపులేని పాలకులు, అధికారులు
జాతీయ రహదారి–143 విస్తరణ పనుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో రూ.1,920 కోట్లతో యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో రహదారి విస్తరణ పనులకు రూ.897.03 కోట్లు, మిగిలిన రూ.1022.97కోట్లు భూసేకరణ, ఇళ్ల యజమానులకు కేటాయించారు. 2016 జూన్ 1న నాటి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పనులకు శంకుస్థాపన చేయగా ఎల్‌అండ్‌టీ సంస్థ పనులు చేపట్టింది. యాదాద్రి జిల్లా వంగపల్లి నుంచి వరంగల్ జిల్లా ఆరెపల్లి వరకు 99.10 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను 30 నెలల్లో పూర్తి చేసే లక్ష్యంతో చేపట్టారు. వాస్తవానికి 2019 జనవరి వరకు పూర్తి కావలసి ఉంది. గడువు ముగిసి ఆరు సంవ త్సరాలు అయినా పూర్తిస్థాయిలో పనులు చేపట్టలేదు.
జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి
జాతీయ రహదారి విస్తరణ పనుల్లో జిల్లా వ్యాప్తంగా ఇదే దుస్థితి నెలకొంది. పెంబర్తి, లింగాలఘణపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూ రు మండలాల్లో సర్వీస్ రోడ్డు పనులను పూర్తి చేయలేదు. పలుచోట్ల యూటర్న్ లేకపోవడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు అదనంగా దూరం తిరిగి వెనక్కి రావాల్సి వస్తున్నది.
● రఘునాథపల్లి మండలంలో సర్వీస్ రోడ్లు వేసినా ఇరుకుగా ఉన్నాయి.
● డివిజన్ కేంద్రమైన స్టేషన్‌ఘన్‌పూర్‌లో సర్వీస్ రోడ్లు అసంపూర్తిగా వేశారు. స్థానిక బస్టాండ్ నుంచి శ్రీవాణి గురుకులం వరకు సర్వీస్ రోడ్డు వేయాల్సి ఉండగా కేవలం విద్యుత్ సబ్‌స్టేషన్ వరకే వేసి వదిలేశారు. దాంతో సర్వీస్ రోడ్డు నిరుపయోగంగా మారింది. ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.
● ఘన్‌పూర్ మండలం రాఘవాపూర్‌లో రహదారికి రెండువైపులా ఇంతవరకు సర్వీస్ రోడ్లు వేయలేదు. ప్రజలు నేరుగా జాతీయ రహదారి పైకి రావడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
● చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో సర్వీస్ రోడ్లు, డ్రెయినేజీల పనులు అరకొరగా చేపట్టారు. అసంపూర్తి సర్వీస్ రోడ్లు, రెయిలింగ్ పనులతో ఆయా మండలాల్లో ప్రజలు పడరాని పాట్లు పాడుతున్నారు.
సర్వీసురోడ్లు లేక ప్రజల అవస్థలు
రాఘవాపూర్‌లో సర్వీస్‌రోడ్డు కోసం గోతులు తీసి
వదిలేసిన రోడ్డు
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామాలు ఉన్న చోట సర్వీస్ రోడ్లు వేయాలి. సర్వీస్ రోడ్డుపై నుంచి ప్రజలు నేరుగా జాతీ య రహదారిపైకి రాకుండా మధ్యలో రెయిలింగ్ ఏర్పాటు చేయాలి. సర్వీస్ రోడ్డుకు, జాతీ య రహదారికి మధ్య హైమాస్ట్ లైట్లు వేయాలి. సర్వీస్ రోడ్డు పక్కన డ్రెయినేజీలు పూర్తి చేసి మురుగు నీరు ఇళ్లలోకి రాకుండా చర్యలు చేపట్టాలి. అయితే సంబంధిత అధికారులు కేవలం జాతీయ రహదారి విస్తరణ చేశారే తప్ప.. సర్వీస్‌రోడ్లు, రెయిలింగ్ పనులను విస్మరించారు. కొన్ని గ్రామాల్లో సర్వీస్‌రోడ్లు కొంతమేర వేసి వదిలేశారు.
Comments
Please login to add a commentAdd a comment