● సీపీఎం ఆధ్వర్యాన రాస్తోరోకో
జనగామ రూరల్: జిల్లాలో ఎండిన వరి, ఇతర పంటలకు నష్టపరిహారం కింద ఎకరాకు రూ.50 వేల చొప్పున చెల్లించడానికి సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వాలి.. ఈ మేరకు డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యాన పట్టణంలో నెహ్రూపార్క్ వద్ద శనివారం రాస్తోరోకో చేశారు. ఈసందర్భంగా జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. భూగర్భ జలాలు తగ్గడంతో యాసంగిలో నీటి వనరుల ఆధారంగానే రైతులు తక్కువ ఎకరాల్లో పంట లు వేశారని, ప్రభుత్వం చెరువులు, కుంటలు నింపకపోవడంతో పంటలు ఎండిపోయాయన్నారు. రైతులందరికీ బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో ‘రైతు భరోసా’ డబ్బులు బ్యాంకు ఖాతాల్లో జమ కాలేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల సర్వే చేపట్టి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఇర్రి అహల్య, బోట్ల శేఖర్, బూడిద గోపి, అజారుద్ధీన్, వెంకటమల్లయ్య, కుర్ర ఉప్పలయ్య, మహేందర్, సురేష్, బాలరాజు, బీరయ్య తదితరులు పాల్గొన్నారు.