జనగామ రూరల్: రానున్న పదో తరగతి పరీక్షలకు విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని, ప్రశాంతంగా రాయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించనున్న టెన్త్ పరీక్ష నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా జిల్లాలోని పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలకు ప్రతీ విద్యార్థి హాజరయ్యేలా ఉపాధ్యాయులు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై కూడా తగిన శ్రద్ధ వహించాలని, తగినంత వ్యాయామం, మంచి పోషకాహారం, నిద్ర కూడా తగినంత ఉండేవిధంగా చూసుకోవాలన్నారు. పరీక్షలకు వెళ్లబోయే చివరి వారం రోజుల్లో కొత్త విషయాలు చదవకుండా చదివిన విషయాలని మళ్లీ రివిజన్ చేసుకోవాలన్నారు. ప్రతీ విద్యార్థి పరీక్షకు హాజరు అయ్యేలా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లా, మండలాల్లో టాప్ స్కోర్ సాధించిన విద్యార్థికి సైకిల్ బహుమతిగా ఇస్తామన్నారు. వందశాతం ఫలితాలు సాధించిన పాఠశాలలకు కూడా ప్రత్యేక అవార్డులు ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీఈఓ రమేశ్, ఏసీజీ రవికుమార్, గౌసియా బేగం తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా పరీక్షలు రాయాలి
జిల్లా, మండల టాపర్లకు బహుమతులు
కలెక్టర్ రిజ్వాన్ బాషా