
పంటలు ఎండుతున్నా పట్టదా..?
● వెల్దండ రిజర్వాయర్ వద్ద రైతుల నిరసన
నర్మెట: ‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. చెరువులు, కుంటల్లో చుక్కనీరు లేదు.. బోర్లు వట్టిపోయాయి.. నాలుగు రోజుల నుంచి రిజర్వాయర్‌లోకి వస్తున్న నీటిని ఎగువకు పంపిస్తున్నారు.. తూములు తీస్తే కేసులు పెడతారా.. ఇదెక్కడి న్యాయం’ అంటూ వెల్దండ గ్రామ రైతులు శనివారం నిరసనకు దిగారు. జేసీబీతో తూమును తెరవడానికి రైతులు ప్రయత్నించగా.. అధికారుల నుంచి ఫోన్ రావడంతో చేసేదిలేక నిరసనకు దిగారు. రెండురోజుల్లో కాల్వల ద్వారా నీరు విడుదల చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని, జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో రైతులు కల్యాణం మల్లేషం, నాగపురి చంద్రయ్య, రావుల సోమిరెడ్డి, కాసర్ల శ్రీరాములు, చిర్ర మల్లారెడ్డి, నాగపురి సత్తయ్య, ఆగమల్ల ప్రేమ్‌కుమార్, అంజిరెడ్డి, పంతంగి రామయ్య, కుమార్, సత్యనారాయణ, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.