
ఆస్తి పన్ను వసూలు 62.09 శాతం
జనగామ: జనగామ పురపాలిక అధికారుల శ్రమకు ఫలితం కనిపించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి.. కలెక్టర్ రిజ్వాన్ బాషా నిత్యం సమీక్షలు, పురమాయింపులతో కొంత మేర మొండి బకాయిలను రాబట్టినా... ఆశించిన మేర లక్ష్యం చేరుకోలేక పోయారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్ పర్యవేక్షణలో కమిషనర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రెవెన్యూ డిపార్డుమెంట్‌తో పాటు బిల్ కలెక్టర్లు, ఇతర సిబ్బంది, ఉద్యోగులు నెల రోజుల పాటు ఉదయం మొదలుకుని రాత్రి 11 గంటల వరకు ఆస్తి పన్ను కోసం ఇంటింటికీ తిరిగారు. మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులను జారీ చేయడంతో పాటు వినూత్న పద్ధతిలో పన్నులను రాబట్టేందుకు అధికారులే ఇళ్ల ముందు ధర్నాకు దిగారు. కూటి కోసం కోటి తిప్పలు అన్నట్టుగా అధికారులు విశ్వ ప్రయత్నం చేసినా... టార్గెట్ రీచ్ కాలేకపోయారు. పట్టణంలో 15,456(గృహాలు, కమర్షియల్) అసెస్‌మెంట్లు ఉన్నాయి. ఆస్తి పన్ను డిమాండ్ రూ.5.77 కోట్లు ఉండగా, ఇందులో రూ.3.57కోట్లు కలెక్షన్ చేయగా... రూ.2.20 కోట్ల మేర బకాయి(62.09శాతం)బకాయి ఉంది. కాగా గత నెల 31వ తేదీ ఒక్కరోజే రూ.8లక్షలు కలెక్షన్ చేయాలని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ ఉండగా, రూ.11 లక్షల మేర వసూలు చేశారు. దీంతో కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా పురపాలికకు రూ.10 కోట్ల మేర నిధులు రానున్నాయి.
సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగిన వసూలు
రూ.3.57 కోట్ల వసూళ్లు.. రూ.2.20 కోట్ల బకాయి