
యువతకు ఉపాధి భరోసా
‘రాజీవ్ యువ వికాసం’ పథకంతో నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు
జనగామ రూరల్: నిరుద్యోగ యువత స్వయం ఉపాధిలో రాణించి ఆర్థికంగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సబ్సిడీపై రుణాలు అందించాలని నిర్ణయించింది. ఇందుకు దరఖాస్తు గడువు ఈనెల 5వ తేదీ వరకు విధించినా.. సర్వర్ సమస్య, దరఖాస్తుదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సమయం పట్టడం.. ఏ యూనిట్‌కు ఎంత మొత్తం ఇస్తారో నిర్ణయం కాకపోవడంతో దరఖాస్తు చేసుకునేందుకు వెనుకాడారు. దీంతో ప్రభుత్వం గడువును ఈనెల 14వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటి వరకు మొత్తం 12 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. గడువు పొడిగించడంతోపాటు విధి విధానాలు విడుదలైనందున దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
కమిటీల పరిశీలన ఇలా..
‘రాజీవ్ యువ వికాసం’ పథకానికి ఆన్‌లైన్‌తోపాటు మండల, మున్సిపల్ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మాన్యువల్‌గా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా ప్రాంతాల్లో వచ్చిన దరఖాస్తులను మున్సిప ల్, మండల కమిటీలు పరిశీలించి అర్హులను ఎంపిక చేసి జిల్లా కమిటీకి పంపుతాయి. జిల్లా కమిటీలు ఆ జాబితాను పరిశీలించి రుణం మంజూరు చేయాల్సి ఉంటుంది. తర్వాత లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తారు.
వచ్చిన దరఖాస్తులు
బీసీ : 6,077 ఎస్సీ : 3,456 ఎస్టీ : 1,790 ఇతరులు : 1,121 మొత్తం : 12,444
ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 12వేలు
ఈనెల 14 వరకు గడువు పొడిగింపు

యువతకు ఉపాధి భరోసా