
సభకు దండులా కదలాలి
● ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నిర్వహించే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు దండులా కదలి రావాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నా రు. శనివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. సభలో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఊరూ, వాడా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మరోపోరాటం తప్పదని స్పష్టం చేశారు. అంతకు ముందు సభకు హాజరయ్యే నాయకులకు స్వాగతం పలికేందుకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
మాజీ మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం
రజతోత్సవ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వెళ్తున్న మాజీ మంత్రి హరీశ్‌రావుకు వరంగల్–హైదరాబాద్ హైవే యశ్వంతాపూర్ జంక్షన్ వద్ద శనివారం ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. నాయకులు తాళ్లసురేష్‌రెడ్డి, బాల్దె సిద్ధిలింగం, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, డాక్టర్ పగిడిపాటి సుధాసుగుణాకర్‌రాజు, మసిఉర్ రెహమాన్, ముస్త్యాల దయాకర్, కె.అనిల్‌రెడ్డి, కృష్ణ, సందీప్, హరిప్రసాద్, లక్ష్మీశ్రీశైలం, నాగరాజు పాల్గొన్నారు.