భూపాలపల్లి అర్బన్: ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు వేతన జీవులను ఆదాయపన్ను (ఐటీ) కలవరపెడుతోంది. ఈ నెలలో చేతికి ఏమైనా జీతం వస్తుందా? లేక పన్ను చెల్లింపులకు సరిపోతుందా? అని లెక్కలు వేసుకుంటారు. ఈ ఏడాది పీఆర్సీ అమలుతో వేతనాలు పెరిగాయి. ఫలితంగా ఆఫీసు సబార్డినేటు మొదలుకొని ప్రతీ ఉద్యోగి పన్ను పరిధిలోకి వచ్చారు. పెరిగిన ఖర్చుల దృష్ట్యా నిబంధనలను సాకుగా చూపి పన్ను తప్పించుకునేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో 3500 మందిపైగా ఉద్యోగులు ఉన్నారు.
ప్రతి నెల వేతనం రావాలంటే డీడీఓల ద్వారా ట్రెజరీకి వేతన బిల్లులు సమర్పించాల్సి ఉంటుంది. ఏటా ఫిబ్రవరిలో ఐటీ రిటర్నులు, పన్ను మినహాయింపు బిల్లులు వేతన బిల్లులకు జతచేయాల్సి ఉండటంతో పలువురు దొడ్డిదారి బిల్లులు సమర్పించడం ఉద్యోగ వర్గాల్లో చర్చకు తెరలేపుతోంది. ముఖ్యంగా దంపతులు ఉద్యోగులుంటే వారు ఇటు హెచ్‌ఆర్‌ఏ పేరిట పన్ను ఎగవేస్తూ.. మరోవైపు బదిలీ సమయంలో స్పౌజ్ కేటగిరి కింద హెచ్‌ఆర్‌ఏ అధికంగా ఉన్నచోటుకు బదిలీ కావడం రెండు విధాలా మెజార్టీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నష్టం వాటిల్లుతోందనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇదే విషయమై నాన్‌స్పాజ్ సంఘం ఉపాధ్యాయులు స్పౌజ్ కేటగిరిని ఎత్తేయాలని కోర్టును ఆశ్రయించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఒకే ఇంట్లో ఉంటూ..
భార్యాభర్తలు వేర్వేరు మండలాలు, గ్రామాల్లో ఉపాధ్యాయ విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి ఆయా పాఠశాలలకు రాకపోకలు చేస్తున్నారు. ఉండేది సొంతింట్లో అయినా.. విధులు నిర్వహిస్తున్న గ్రామాల్లో అద్దె ఇంట్లో ఉంటున్నట్లు ఒక్కొక్కరు రూ.లక్షపైనే బిల్లులు సమర్పించారు. ఆదాయ పన్ను భారం తప్పించుకోవాలని తప్పుడు సమాచారం ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ దంపతుల్లో చాలామంది ఇదే దారిని ఎంచుకుని పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారు.
రాకపోకలు సాగిస్తూ..
జిల్లాల విభజన తర్వాత చాలామంది ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇది వరకు ఉంటున్న జిల్లాను వదిలి మరో జిల్లాకు బదిలీ అయినా.. అలా బదిలీ అయిన వారంతా జట్టుగా ఏర్పడి కారులో నిత్యం సొంతింటికి ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ.. పనిచేస్తున్న చోట ఇంటి అద్దె చెల్లిస్తున్నామని వేలకు వేల బిల్లులు పెట్టి క్లెయిమ్ చేసుకుంటూ ఆదాయపన్ను శాఖకు ఎగనామం పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 500 మంది ఉద్యోగులు ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు రాకపోకలు సాగిస్తుండటం గమనార్హం.
పెరిగిన వేతనాలతో ఉద్యోగులపై భారం
తప్పించుకునేందుకు తప్పుడు పత్రాలు
ఉద్యోగులను భయపెడుతున్న ఆదాయపన్ను
అక్రమార్జనకు అవకాశం..
వేతన స్థిరీకరణ సందర్భంలో, ఇప్పుడు పన్ను మినహాయింపు బిల్లుల సమర్పణకు డీడీఓలకు, ట్రెజరీ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఆయా బిల్లుల సమర్పణకు వెళ్లిన డీడీఓల నుంచి ట్రెజరీ ఉద్యోగులు కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సాకుతో అసలు విషయం తెలిసిన డీడీఓలు సైతం ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి అందినంత దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
Comments
Please login to add a commentAdd a comment