
కాళేశ్వరంలో జాతీయ రహదారి సర్వే
కాళేశ్వరం: మహదేవపూర్ నుంచి కాళేశ్వరం వరకు జాతీయ రహదారి(353 సీ) నిర్మాణంలో భాగంగా ఎంజాయ్‌మెంట్ సర్వే శుక్రవారం భూపాలపల్లి ఆర్డీఓ రవి ఆధ్వర్యంలో నిర్వహించారు. కాళేశ్వరం శివారు నుంచి కన్నెపల్లి వరకు రైతుల భూముల్లో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. ఈ సర్వేను కొంత మంది రైతులు అడ్డుకొని తమకు తగిన పరిహారం ఇచ్చే వరకు నిలిపేయాలని మొరపెట్టుకున్నారు. ఈ సర్వేలో తహసీల్దార్ ప్రహ్లాద్‌రాథోడ్, డీటీ కృష్ణ, ఎన్‌హెచ్ డీఈఈ కిరణ్‌కుమార్, ఏఈఈ ప్రమోద్, సర్వేయర్ రమేష్, ఆర్‌ఐ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
9న కాళేశ్వరానికి
ముగ్గురు మంత్రుల రాక?
కాళేశ్వరం: కాళేశ్వరం దేవస్థానంలో జరిగే మహాకుంభాభిషేకంలో పాల్గొనేందుకు ఈనెల 9న ఆదివారం ముగ్గురు మంత్రులు, ఎంపీ రానున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ అనుమతితో మంథని శాసనసభ్యులు, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రానున్నారని అధికారవర్గాల ద్వార తెలిసింది.
38మంది విద్యార్థినులను చితకబాదిన సీఆర్‌టీ
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలోని జంగేడు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయంలో 38మంది విద్యార్థినులను విద్యాలయ ఇంగ్లిష్ సీఆర్‌టీ చితకబాదినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్‌కు అందిన సమాచారంతో శుక్రవారం విచారణ చేపట్టారు. ఈ నెల 5వ తేదీన రాత్రి 8గంటల సమయంలో 9వ తరగతి చదువుతున్న 38మంది విద్యార్థినులపై విచక్షణారహితంగా ఇంగ్లిష్ సీఆర్‌టీ ముస్కాన్ కొట్టినట్లు విద్యార్థులు తెలిపారు. కిటికీలో నుంచి బయట వారితో మాట్లాడుతున్నారని కంక కర్రతో చేతులపై బలంగా కొట్టినట్టు సమాచారం. తీవ్ర గాయాలపాలైన రిషితకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి పంపినట్లు డీఈఓ రాజేందర్ తెలిపారు. రమ్య, సోని, సాయిహర్షితలకు గాయాలైనట్లు ఆనవాళ్లు ఉన్నాయని, ఈ ఘటనపై విచారణ జరిపి తగులు చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు.
విద్యార్థులకు అవగాహన
భూపాలపల్లి అర్బన్: ప్రకృతి వైపరిత్యాల వలన సంభవించే ప్రమాదాల సందర్భంగా రక్షణపై ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, భూకంపాలు సంభవించినప్పుడు, భవనాలు కూలిన సమయంలో పాటించాల్సిన జాగ్రతలు, ప్రమాదంలో ఇరుక్కున, గాయాల పాలైన వారిని ఏ విధంగా రక్షించాలనే అంశాలపై విద్యార్థులకు కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అప్రమత్తంగా వ్యవహరిస్తే ప్రమాదాల నుంచి బయటపడవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డీఆర్‌ఎఫ్ అధికారులు, సిబ్బంది, ఇన్‌చార్జ్ డీఈఓ రాజేందర్, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్‌ఐలు రామస్వామి, అజారుద్దీన్, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వైభవంగా
సీతారాముల కల్యాణం
మంగపేట: మండలంలోని బోరునర్సాపురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని శుక్రవారం వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో ఈ నెల 4 నుంచి కొనసాగుతున్న 18వ వార్షికోత్సవాల చివరి రోజు సందర్భంగా ఉదయం సంక్షేప రామాయణం, ఆదిత్య హృదయం హోమం పూజలను నిర్వహించారు. అనంతరం సీతారాముల ఉత్సవ మూర్తుల కల్యాణం వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు మంగపేట, చెరుపల్లి, కమలాపురం తదితర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్రా శ్రీధర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment