సతమతమవుతున్న మిర్చి రైతులు
క్వింటాకు రూ.10వేల దిగువకు పడిపోయిన ధర
గతేడాది క్వింటా రూ.20వేలు
పెరిగిన కూలి, కౌలు ఖర్చులు
అప్పుల ఊబిలోకి అన్నదాతలు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో మిర్చి రైతులు దిగుబడి రాక.. మార్కెట్‌లో ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో క్వింటా మిర్చి ధర రూ.20వేలు పలకగా.. ప్రస్తుత సీజన్‌లో రూ.7వేల నుంచి రూ.11,500 వరకు మార్కెట్ రేటు పలుకుతుండడంతో రైతు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. జిల్లాలో ఈ సీజన్‌లో దాదాపు 19,637 ఎకరాల్లో మిర్చి సాగు చేశారు.
ధరలో భారీ తేడా..
గతేడాది ఈ సీజన్‌లో అన్‌రాడ్ మిర్చి రకం క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.20వేల దాకా ధర పలికింది. సింజెంటా, బ్యాడిగ, రకం రూ.18వేల నుంచి రూ.30వేలు, మిర్చి రకాలు రూ.14వేల నుంచి రూ. 22 వేల వరకు ధర పలికాయి. ప్రస్తుతం ధరలు దాదాపు 50 శాతానికి తగ్గిపోయాయి.
ధరల పతనం..
గతేడాది ఎండుమిర్చికి మంచి ధర పలికింది. క్వింటా మిర్చి రూ.20వేల వరకు పలికింది. కొంతమంది మరింత ఎక్కువ ధర వస్తుందని అశతో కోల్డ్ స్టోరేజీలో మిర్చిని దాచారు. గత సీజన్ నుంచి ఈ సీజన్ వరకు సుమారు 50శాతం ధరలు పడిపోవడం గమనార్హం. కోల్డ్ స్టోరేజీలో బస్తాకు ఏడాదికి రూ.170 నుంచి రూ.200 వరకు వసూలు చేశారు. తేజ రకం మిర్చి కోతకూలీ క్వింటాకు రూ.3 వేల వరకు ఖర్చుఅవుతోంది. దీనికితోడు పెటుబడి ఖర్చులు కలుపుకుంటే దాదాపు రూ.7వేల వరకు ఖర్చువస్తుంది. వర్షాల కారణంగా కాయల్లో నాణ్యత లోపించి నాణ్యత తక్కువగా ఉందని మార్కెట్‌లో ధరలు తక్కువ ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు బోయిని కిష్టయ్య. జంగేడు గ్రామం. ఎకరానికి రూ.25వేల చొప్పున మూడెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి సాగుచేశాడు. విత్తనాలకు రూ.48వేలు, కూలీలకు రూ.90వేలు, పురుగుమందులకు పదిసార్లకు కలిపి రూ.1.41లక్షలు.. ఇలా ఇతర ఖర్చులతో కలిపి మూడెకరాలకు 4.50లక్షలు పెట్టుబడి పెట్టాడు. దిగుబడి మాత్రం ఎకరాలకు 8 క్వింటాల నుంచి 10 క్వింటాల వరకు మాత్రమే వచ్చింది. మార్కెట్ ధర కూడా తగ్గడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. జిల్లాలో మిర్చి రైతులందరి పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment