ఇలా.. ‘నులి’మేద్దాం
● అన్ని కేంద్రాలకూ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
● జిల్లాలో 69,652మంది పిల్లలు
రేపు నులి పురుగుల నివారణ కార్యక్రమం
నులి పురుగులను నివారిస్తే మనం తింటున్న ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహిస్తుంది. తద్వారా రక్తహీనతను నివారించవచ్చు. ఆరోగ్యం బాగుపడటంతో విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్లేందుకు ఆసక్తి కలుగుతుంది. పని చేయగల సామర్థ్యం పెరుగుతుంది.
భూపాలపల్లి అర్బన్: పిల్లల్లో అనేక వ్యాధులకు కారణమవుతున్న నులి పురుగుల నివారణకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమం చేపడుతోంది. నులి పురుగుల నిర్మూలనకు జిల్లాలోని 19ఏళ్ల లోపు పిల్లలు 69,652 మందికి ఈ నెల 10న ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్, ఒకేషనల్ కాలేజీలు, మెడికల్ కళాశాలలతో పాటు బడి బయట ఉన్న పిల్లలందరికీ ఈ మాత్రలు అందజేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేసింది. ఒకటి నుంచి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్ర (200 ఎం.జీ), ఆపై వయస్సు పిల్లలకు ఒక పూర్తి మాత్ర (400 ఎంజీ) వేయనున్నారు. ఈ మాత్రలను ఇప్పటికే ఆయా కేంద్రాలకు పంపిణీ చేశారు.
వ్యాపించే విధానం..
మనిషి శరీరంలోకి ఏలిక పాములు, నులి పురుగులు, కొంకెర పురుగులు అనే మూడు రకాల పురుగులు ప్రవేశిస్తుంటాయి. నులి పురుగులు ఉన్న వ్యక్తి మల విసర్జన చేయడం ద్వారా అందులోని గుడ్లు నేలలోకి తద్వారా తాగునీరు, గాలి ద్వారా ఆహార పదార్థాలపైకి చేరుతాయి. తెలియకుండా ఆ నీరు తాగిన, అటువంటి ఆహారం తిన్న వారి కడుపులోకి ఈ నులి పురుగులు ప్రవేశిస్తాయి. కడుపులో ఈ పురుగులున్న వారు రక్తహీనత, పోషకాల లోపం, ఆకలి మందగించడం, నీరసం, ఆందోళన, కడుపునొప్పి, వికారం, వాంతులు, విరేచనాలు, బరువు తగ్గడం, తరచుగా ఇన్‌ఫెక్షన్లకు గురవడం వంటి వాటితో బాధ పడుతుంటారు. వీటి నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ఒక్కటే మార్గం. దీర్ఘకాలిక వ్యాధులున్న వారు కూడా వీటిని తీసుకోవచ్చు.
నిర్మూలనతో ఇవి ప్రయోజనాలు
ఈ జాగ్రత్తలు మేలు
గోళ్లను చిన్నవిగా, శుభ్రంగా ఉంచుకోవాలి.
శుభ్రమైన నీటిని తాగాలి.
ఆహార పదార్థాలపై ఎప్పుడూ మూత ఉంచాలి.
కూరగాయలు, పండ్లను శుభ్రమైన నీటితో కడగాలి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
బయట తిరిగేటప్పుడు బూట్లు/ చెప్పులు ధరించాలి.
బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయవద్దు. మరుగుదొడ్డినే వాడాలి.
ఏదైనా తినకముందు, తిన్న తర్వాత, మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
ప్రతి విద్యార్థికీ పంపిణీ
వైద్య, ఆరోగ్యం, విద్య, ఐసీడీఎస్, ఇంటర్మీడియెట్ విద్య, సాంఘిక సంక్షేమం, మున్సిపల్ తదితర శాఖల సమన్వయంతో నులి పురుగుల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ నెల 10న ఆల్బెండజోల్ మాత్రలు అందుకోలేని వారికి ఈ నెల 17వ తేదీన మాప్ అప్ డే నిర్వహించి, మాత్రలు అందజేస్తాం. ఆరు నెలలకోసారి ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా పిల్లల్లో నులిపురుగులను నివారించవచ్చు.
– డాక్టర్ మధుసూదన్,
జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి
మాత్రలు చప్పరించాలి..
ఆల్బెండజోల్ మాత్రలను మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలి. ఈ మాత్రలను చప్పరించడం లేదా నమిలి మింగడం చేయాలి. మాత్రలు తీసుకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే దగ్గరలోని వైద్య సిబ్బందిని సంప్రదించాలి.
– డాక్టర్ సురేందర్, పిడియాట్రిషన్
ఇలా.. ‘నులి’మేద్దాం
Comments
Please login to add a commentAdd a comment