గొంతెమ్మ గుట్ట జాతర ప్రారంభం
కాటారం: ప్రతాపగిరి సమీపంలోని ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై శనివారం జాతర ఉత్సవాలు మొదలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగనున్న జాతరలో భాగంగా మొదటి రోజు మర్రిపల్లి లక్ష్మిదేవర ఉత్సవ విగ్రహాలను కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్దకు తీసుకెళ్లి పుణ్యస్నానం ఆచరింపజేశారు. అనంతరం ప్రతాపగిరి కోటలోని మేలు దర్వాజ వద్ద మైసమ్మ పూజలు, యాటపోతు బలి కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మి దేవరను జడత కోటలోని గొంతెమ్మ గుడికి తీసుకెళ్లి నిలిపారు. ఈ సందర్భంగా శివసత్తులు డప్పుచప్పుళ్ల నడుమ పూనకాలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతాపగిరి నాయక్‌పోడు ఆలయ కమిటీ సభ్యులు బీసుల రవీందర్, మేకల పోచయ్య, సంతోష్, కిష్టయ్య, ఎర్రయ్య, రాజేందర్, ధర్మరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
‘బీజేపీది చరిత్రాత్మక విజయం’
భూపాలపల్లి రూరల్: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీది చరిత్రాత్మక విజయమని ఆ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హామీలను ప్రజలు నమ్మలేదన్నారు. ఆ పార్టీలపై ఎంత వ్యతిరేకత ఉందో ఫలితాలను బట్టి అర్థమవుతోందన్నారు. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీని గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు.
వాహన పన్నులు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: వాహన యజమానులు గడుపులోపు పన్నులు చెల్లించాలని జిల్లా రవాణాశాఖ అధికారి సంధాని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో జిల్లాలో వాహన తనిఖీలు విస్తృతంగా చేపట్టనున్నట్లు తెలిపారు. పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలు పట్టుబడినట్లయితే కేసులు నమోదుచేసి భారీ జరిమానాలు విధించనున్నట్లు హెచ్చరించారు. వాహనదారులందరూ రోడ్డు నియమాలు పాటించాలని సూచించారు.
పెండింగ్ బకాయిలు
చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: 2022–23 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి అధికారులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు చెల్లించాలని కోల్ మైన్స్ అఫీసర్ అసోసియేషన్(సీఎంఓఐ) నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం ఏరియా అసోసియేషన్ అధ్వర్యంలో ఎస్‌వోటు జీఎం కవీంద్రకు వినతిపత్రం అందజేశారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో పనితీరు సంబంధింత చెల్లింపు(పీఆర్‌పీ)ను కోలిండియాలో 2024 జూన్‌లో చెల్లించినట్లు తెలిపారు. సింగరేణిలో మాత్రం ఇప్పటి వరకు చెల్లించకపోవడం బాధాకరమన్నారు.
రామప్పలో పర్యాటకుల సందడి
వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని శనివారం పర్యాటకులు, విద్యార్థులు సందర్శించారు. రెండో శనివారం హాలిడే కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో తరలివచ్చి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. నందీశ్వరుని చుట్టూ విద్యార్థులు ప్రదక్షిణలు నిర్వహించారు. రామప్ప శిల్పాల వద్ద గ్రూప్ ఫొటోలు దిగారు. అనంతరం రామప్ప సరస్సులో బోటింగ్ చేస్తూ కేరింతలు కొట్టారు.
విదేశీయుల రాక..
రామప్ప దేవాలయాన్ని ఇటలీకి చెందిన మైక్రో, మార్కో, స్టెపీనో, జాద, జర్మనీకి చెందిన మార్కుస్, క్లాడియాలు వేరు వేరుగా సందర్శించి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేయగా గైడ్‌లు విజయ్‌కుమార్, వెంకటేశ్‌లు ఆలయ విశిష్టత గురించి వివరించారు. రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్ అంటూ రామప్ప అందాలను తమ సెల్‌ఫోన్‌లో బందించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment