
నియామక ఉత్తర్వులు జారీచేయాలి
భూపాలపల్లి: గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల విధులు నిర్వహించునున్న సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై శనివారం ఐడీఓసీ కార్యాలయంలో రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించేందుకు సిబ్బందికి శిక్షణ అత్యంత కీలకమని చెప్పారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమగ్రంగా అర్థం చేసుకుని, సక్రమంగా విధులు నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని వివరించారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సకాలంలో నియమించి, వారికి విధుల నిర్వహణ ప్రక్రియపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భూపాలపల్లి, కాటారం డివిజన్ల వారీగా షెడ్యూల్ తయారు చేయాలని వివరించారు. ఎన్నికల నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని, అప్పుడే ఎన్నికలను పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment