
గాసం.. గోస
● వర్షాభావ పరిస్థితులతో
దెబ్బతిన్న పంట పొలాలు
● తగ్గిన ఎండుగడ్డి దిగుబడి
● ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు
● పశుపోషకులు,
రైతులకు పెరుగుతున్న భారం
కాటారం: ఒకప్పుడు పశుగ్రాసానికి నిలయాలుగా నిలిచిన పల్లెలో ప్రస్తుతం పశుగ్రాసం కొరత తీవ్రస్థాయిలో నెలకొంది. జిల్లాలోని పలు పల్లెల్లో సరిపడేంత పశుగ్రాసం లేకపోవడంతో పశుపోషకులు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశుగ్రాసం లేమి కారణంగా తమ పశువుల పోషణ భారంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామాల్లో ఎక్కడ కూడా పశుగ్రాసం లేకపోవడంతో రైతులు, పశుపోషకులు ఇతర ప్రాంతాల నుంచి పశుగ్రాసాన్ని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రైతులకు, పశుపోషకులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది.
మూగజీవాలకు దొరకని ఎండుగడ్డి..
జిల్లాలో 90శాతం గ్రామాలన్నీ వ్యవసాయాధారిత కుటుంబాలే కావడంతో పశుపోషణ అధికంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలో గేదెలు, ఆవులు, ఎద్దులు తప్పనిసరిగా ఉన్నాయి. వర్షాకాలంలో పంట పొలాలు, ఇతరత్రా తోటల సాగు అధికంగా ఉండటంతో పశుగ్రాసం కొరత అంతంత మాత్రమే ఉంటుంది. చలికాలం, వేసవి కాలం సమీపిస్తే పచ్చగడ్డి దొరికే అవకాశం లేకపోవడంతో మూగజీవాలకు ఎండుగడ్డే దిక్కవుతుంది. ఈ ప్రాంతంలో ఎడ్డుగడ్డి సరిగా దొరికే పరిస్థితి లేకపోవడంతో మూగజీవాలు గాసం కోసం తల్లడిల్లిపోతున్నాయి. గ్రామాల్లోని పశువులు సమీపంలో అటవీ ప్రాంతంలోకి వెళ్లి ఆకులు, చెరువులోని తుంగ, ఇతరత్రా వాటిని తిని కడుపునింపుకుంటున్నాయి. పశుగ్రాసాన్ని తెచ్చే స్థోమత లేకపోవడంలో పలువురు రైతులు తమ పశువులను ఊరి మీద వదిలేస్తున్న దాఖలాలు లేకపోలేదు.
వర్షం, వరదల ప్రభావంతో..
జిల్లాలో వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వానాకాలంలో రైతులు సాగుచేసిన పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా చెరువులు, కుంటలు తెగిపోవడంతో పాటు వరదలు పోటెత్తడంతో పంట పొలాలు కొట్టుకుపోవడం, ఇసుక మేటలు వేసి దెబ్బతిన్నాయి. కాటారం మండలం దామెరకుంట, గుండ్రాత్‌పల్లి, గంగపురి, గంగారం, విలాసాగర్, వీరాపూర్, ఇబ్రహీంపల్లి, చింతకాని, పోతుల్వాయి, మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి, మేడిగడ్డ, బ్రాహ్మణపల్లి, మల్హర్ మండలం మానేరు ఆయకట్టు పొలాలు, మహాముత్తారం మండలంలో పలు చెరువులు తెగడంతో ఆయకట్టు పొలాలు నీట ముని గాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం గతంతో పోల్చుకుంటే పెరిగినప్పటికీ వర్షం, వరదల కారణంగా దిగుబడి మాత్రం తీవ్రంగా తగ్గిపోయింది. దీని కారణంగా ఎండుగడ్డి కొరత సమస్య జఠిలమైంది.
ఎండుగడ్డికి భలే గిరాకీ..
గ్రామాల్లో సరిగా పశుగ్రాసం లభించకపోవడంతో ఎండుగడ్డికి భలే గిరాకీ నెలకొంటుంది. ఒకప్పుడు రూ.3 నుంచి రూ.5 పలికిన ఎండుగడ్డి పంజ ప్రస్తుతం రూ.15 నుంచి రూ.20కి పెరిగిపోయింది. మిషన్ ద్వారా కోసిన పొలం గడ్డిని రైతులు ఎకరాకు రూ.2వేల నుంచి 3వేలకు విక్రయించే వారు కానీ ప్రస్తుతం రూ.6వేల నుంచి 7వేల వరకు ధర పలుకుతుంది. ఎండుగడ్డి ధరలు కొండనంటుతున్నప్పటికీ తమ మూగజీవాల కోసం పశుపోషకులు పశుగ్రాసాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొన్ని పశువులు మిషన్ ద్వారా కోసిన గడ్డిని తినకపోవడంతో రైతులు అధిక ధర వెచ్చించి కూలీల ద్వారా సేకరించిన గడ్డిని కొనుగోలు చేస్తున్నారు. ఆయా గ్రామాలకు చెందిన పశుపోషకులు మంథని, అడవిసోమన్‌పల్లి, పెద్దపల్లి లాంటి ప్రాంతాల నుంచి అధిక ధర, రవాణా భారాలకు ఓర్చుకొని తెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment