
నేటి ప్రజావాణి రద్దు..
భూపాలపల్లి రూరల్: నేడు కలెక్టరేట్‌లో జరుగనున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దుచేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉందని, జిల్లా యంత్రాంగం ఎన్నికల విధుల్లో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దుచేసినట్లు చెప్పారు. ప్రజలు గమనించాలని కలెక్టర్ సూచించారు.
వైభవంగా ప్రతాపగిరి గుట్ట జాతర
కాటారం: ప్రతాపగిరి గొంతెమ్మ గుట్టపై నిర్వహిస్తున్న గొంతెమ్మ లక్ష్మిదేవర గుట్ట జాతర ఆదివారం రెండో రోజు వైభవంగా కొనసాగింది. శనివారం ప్రారంభమైన జాతర వేడుక రెండో రోజు గుట్టపైకి లక్ష్మిదేవర, ఇతర దేవతామూర్తుల రాకతో సందడిగా మారింది. అంతకుముందు జాతర కమిటీ, ఆలయ కమిటీ, గిరిజన నాయక్‌పోడ్ సంఘాల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పలు గ్రామాల నుంచి తరలివచ్చిన లక్ష్మిదేవర బృందాలు డప్పు చప్పుళ్ల నడుమ సంప్రదాయ నృత్యాలతో ఆడిపాడారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. అనంతరం గుట్టపైకి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బీసుల రవీందర్, మేకల పోచయ్య, సంతోష్, కిష్టయ్య, ఎర్రయ్య, రాజేందర్, ధర్మరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.
విరాళ దాతలు అసంతృప్తి
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్ధానంలో జరిగిన మహాకుంభాభిషేక మహోత్సవంలో పలు రకాలు విరాళం ఇచ్చిన దాతలు అసంతృప్తి చెందారు. ఆదివారం కుంభాభిషేకం ముగిసిన తరువాత కలశ దాతలు, ఇతర దాతలకు సన్మానం చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన మహేందర్ అనే భక్తులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. కనీసం అతని పేరు పిలవలేదని, సన్మానం చేయలేదని వాపోయాడు. రూ.2,516 కలశపూజలకు విరాళంగా ఇచ్చిన భక్తులు కొంత మందిని పిలిచి మిగితా వారిని క్రమం ప్రకారం పిలువలేదని కొంతమంది భక్తులు దేవస్థానం ఉద్యోగులతో వాగ్వాదం జరిగింది. కొంతసేపు తరువాత వారికి నచ్చజెప్పి సన్మానించారు.
నట్టల నివారణ మాత్రల
పంపిణీ వాయిదా
భూపాలపల్లి అర్బన్: నేడు జరగాల్సిన నట్టల నివారణ మాత్రల పంపిణీ కార్యక్రమం వాయిదా పడినట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ చల్ల మధుసూదన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నేటి కార్యక్రమాలను వాయిదా వేసినట్లు చెప్పారు. త్వరలో తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు.
జిల్లా చైర్మన్‌గా గోవర్ధన్
భూపాలపల్లి అర్బన్: వర్డల్ కన్జ్యూమర్ రైట్స్ ఫోరమ్ జిల్లా చైర్మన్‌గా సిరంగి గోవర్ధన్‌ను నియమించినట్లు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నలమాస శ్రీకాంత్ తెలిపారు. హనుమకొండలో ఆదివారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా వైస్ చైర్మన్లుగా గుండాల సునిల్‌చంద్ర, సురేష్, లతిష్, శ్రీనివాస్‌లను నియమించినట్లు తెలిపారు.
హేమాచలక్షేత్రంలో
భక్తుల కోలాహలం
మంగపేట: మండల పరిధిలోని హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయం ప్రాంగణంతో పాటు చింతామణి జలపాతం, వనదేవత ప్రాంతం కోలాహలంగా కనిపించింది. వివిధ వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో లక్ష్మీనర్సింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు దర్శించుకుని పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు సమర్పించారు.

నేటి ప్రజావాణి రద్దు..

నేటి ప్రజావాణి రద్దు..
Comments
Please login to add a commentAdd a comment