భూపాలపల్లి రూరల్: గ్రూప్–1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులు, ఉచిత శిక్షణ కోసం ఈనెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి శైలజ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అల్ప సంఖ్యాక వర్గాల నిరుద్యోగ యువతీ యువకులు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు, సంబంధిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్, రూమ్ నంబర్ 5లో సంప్రదించాలన్నారు.
బ్లాక్ లెవల్ క్రీడాపోటీలు
భూపాలపల్లి అర్బన్: నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి బ్లాక్ లెవల్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి చింతల అన్వేష్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వాలీబాల్, గ్రూప్ రన్నింగ్, షెటిల్ సింగిల్స్, కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 18 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయస్సులోపు ఆసక్తిగల యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల క్రీడాకారులు జిల్లా యూత్ క్లబ్ అధ్యక్షుడు చల్ల దీపక్ 75697 68191 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
ఉత్తమ సేవలు
భూపాలపల్లి రూరల్: విద్యుత్ వినియోగదారులకు కొత్త విద్యుత్ సర్వీసుల మంజూరు మరింత సులభతరం చేశామని జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ మల్చూర్ నాయక్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వినియోగదారు డు తన అప్లికేషన్ స్థితిని ట్రాకింగ్ సిస్టంద్వారా తెలుసుకోవడానికి వెసులుబాటు కల్పించామన్నారు. అప్లికేషన్ నంబర్‌తో టీజీఎన్పీడీసీఎల్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. వినియోగదారుడు మరింత సమాచారం తెలుసుకోవడానికి 1912కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లాలో బర్డ్‌ఫ్లూలేదు
భూపాలపల్లి రూరల్: జిల్లాలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ లేదని, వినియోగదారులు, కోళ్ల యజమానులు అధైర్యపడవద్దని జిల్లా పశు, సంవర్ధక శాఖ అధికారి కుమారస్వామి అశోద సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ వ్యాధి ఎక్కువగా చలిలో వ్యాప్తి చెందుతుందని, ఇప్పటికే జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయని కోళ్లకు ఇబ్బంది లేదన్నారు. కోళ్లు నిరసించినట్లయితే మండల పశువైద్యాధికారుల సలహాలు సూచనలు తీసుకోవాలన్నారు. ఈ వ్యాధి నివారణ అవగాహన కోసం కోళ్ల ఫారాల యజమానులతో 12న బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
తాడిచర్లలో
క్షుద్రపూజల కలకలం
మల్హర్: తాడిచర్ల శివారులోని తోళ్లపాయ వైపు.. పెద్దమ్మ గుడి, బీసీ కాలనీ పోయే మూడు బాటల వద్ద ఆదివారం అర్ధరాత్రి క్షుద్ర పూజలు చేయడం కలకలం రేగింది. మూడు రోడ్లు కలిసే చోట నిమ్మకాయలు, పసుపు, కుంకుమలతో కూడిన ముద్దలు చేసి, గొర్రె పిల్లను బలిచ్చారు. క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనకు గురువుతున్నారు. ఈ ప్రాంతంలో పొలాలు ఉన్న రైతులు అటుగా వెళ్లడానికి భయపడుతున్నారు. మరి కొంతమంది రైతులు బిక్కుబిక్కుమంటూ వారి పనులకు వెళ్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment