
పకడ్బందీగా పోలింగ్ ప్రక్రియ
భూపాలపల్లి: ఈ నెల 27న జరుగనున్న ఖమ్మం, నల్లగొండ, వరంగల్ ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నిక పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఎన్నికల నిర్వహణకు విధులు కేటాయించిన పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు, రూటు, సెక్టార్, నోడల్ అధికారులకు సోమవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల పోలింగ్ నిర్వహణపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. భూపాలపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 329 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఏడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలకు 13మంది పీఓలు, 12మంది ఏపీఓలు, 24మంది ఓపీఓలను నియమించామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్, శిక్షణ నోడల్ అధికారి సీపీఓ బాబురావు, ఆర్డీఓ రవి తదితరులు పాల్గొన్నారు.
బోర్లు మంజూరు చేయాలి..
మా తోట కార్యక్రమంలో భాగంగా పండ్లతోటలు సాగు చేస్తున్న రైతులకు బోర్ బావులు మంజూరు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయపు కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం రెవెన్యూ, అటవీ, ‘మా తోట’ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మహాముత్తారం మండలంలోని పలు గ్రామాల్లో నాబార్డు ఆధ్వర్యంలో మా తోట కార్యక్రమాన్ని చేపట్టి గిరిజన రైతులు పండ్ల తోటలు సాగు చేస్తున్నారని తెలిపారు. రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని మొక్కల సంరక్షణకు నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నందున ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతులకు బోరుబావులు మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌కలెక్టర్ మయాంక్‌సింగ్, అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతులకు బోర్లు మంజూరు చేయాలి
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment