విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Published Wed, Feb 12 2025 10:05 AM | Last Updated on Wed, Feb 12 2025 10:05 AM

విద్య

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

మొగుళ్లపల్లి: మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. మండలంలో మంగళవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగుల హాజరు నమోదు పట్టిక, ల్యాబ్‌, ఫార్మాసి, వార్డులను తనిఖీ చేశారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని తెలిపారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలుకు ఎలాంటి ఇబ్బంది రావొద్దన్నారు. అనంతరం మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్‌ వంటగది, డైనింగ్‌ హాల్‌, విద్యార్థుల కోసం తయారు చేసిన మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రతి రోజు భోజనం ఎలా ఉంటుందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. నిర్దేశిత డైట్‌ మెనూ కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్ర పై అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక అధికారి, వార్డెన్‌ ప్రతి రోజు భోజ నాన్ని తనిఖీ చేయాలని ఆదేశించారు. నాణ్యమైన కూరగాయలు, మాంసం అందించాలని పేర్కొన్నా రు. కార్యక్రమంలో ఆర్డీఓ రవి, తహసీల్ధార్‌ సునీత, ఎంపీడీఓ హుస్సేన్‌, ప్రత్యేక అధికారి శారద, ఏటీపీలు ప్రభాకర్‌, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

భూముల పరిశీలన..

గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే రహదారి నిర్మాణంలో కోల్పోతున్న రైతుల వ్యవసాయ భూములను కలెక్టర్‌ రాహుల్‌ శర్మ మంగళవారం నేషనల్‌ హైవే అధికారులతో కలిసి పరిశీలించారు. మండలంలోని ఇస్సీపేట, రంగాపురం గ్రామాలలో గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవేలో భూములు కోల్పుతున్న రైతులతో మాట్లాడారు. నాగ్‌పూర్‌ నుంచి విజయవాడ వరకు నూతనంగా నిర్మిస్తున్న నేషనల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే భూపాలపల్లి జిల్లాలో టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల మీదుగా వెళ్తున్న క్రమంలో భూ సేకరణ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మొగుళ్లపల్లి మండలంలోని ఇస్సీపేట, రంగాపూర్‌, మేదరమెట్ల, మొగుళ్లపల్లి గ్రామాల్లో సుమారు 8.78 కిలోమీటర్ల మేర నేషనల్‌ హైవే వెళ్తున్న క్రమంలో రైతులనుంచి భూసేకరణ చేపట్టామని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రంగాపూర్‌ గ్రామ శివారులో 20 ఎకరాల విస్తీర్ణంలో రెస్ట్‌ పాయింట్‌ (పార్కింగ్‌ ఏరియా)ఏర్పాటు చేస్తున్నారని నేషనల్‌ హైవే అధికారులతో మాట్లాడి దానిని ప్రభుత్వ భూమి ఉన్న చోటకు మార్చాలని రైతులు కోరగా నేషనల్‌ హైవే అధికారులతో మాట్లాడి మార్చుటకు ప్రయత్నిస్తానని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో నేషనల్‌ హైవే పీడీ దుర్గా ప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి శ్రీకాంత్‌ రెడ్డి, ఏడీ సునీల్‌, ఆర్డీఓ రవి, తహసీల్దార్‌ సునీత, రైతులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ రాహుల్‌శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి1
1/1

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement