సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం
భూపాలపల్లి అర్బన్: సింగరేణి భవిష్యత్‌లో ఐదు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సంస్థ సీఎండీ బలరాంనాయక్ తెలిపారు. సింగరేణి కార్మిక చైతన్య యాత్రలో భాగంగా శుక్రవారం సింగరేణి డైరెక్టర్లు సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లుతో కలిసి భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 1, 5, 6, 8, ఓసీపీ–2, 3 గనులను సందర్శించారు. అంతకుముందు కేటీకే 5వ గని ఏర్పాటుచేసి బలరామ నందనవనంను సీఎండీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. భూగర్భ గనులు నష్టాల బాటలో ఉన్నాయని, వాటిలో సౌకర్యాలు మెరుగుపర్చనున్నట్లు పేర్కొన్నారు. ఏరియాలో తాడిచర్ల, వెంకటాపూర్ బ్లాక్‌లను సింగరేణికి కేటాయించి బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు కృషి చేస్తున్నట్లు వివరించారు. సింగరేణి అధికారుల అలసత్వంతోనే సంస్థలో క్షేత్రస్థాయిలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తమ దృష్టికి రావడం లేదని.. అందులో భాగంగా కార్మిక చైతన్యం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అందరూ తమకు కేటాయించిన విధులను తప్పనిసరిగా నిర్వర్తించాలన్నారు. భారీ యంత్రాల వినియోగ సమయాన్ని పెంచాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా హాజరవుతూ నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషిచేయాలని ఆదేశించారు. గనులలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగులతో చైర్మన్ మాట్లాడి వారికి కావలసిన సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందరూ అలసత్వాన్ని వదిలి ఉత్సాహంగా పనిచేయాలన్నారు. ఆస్పత్రుల అడ్మినిస్ట్రేషన్‌కు మిలిటరీ డాక్టర్‌ను నియమిస్తున్నట్లు తెలిపారు. సంస్థలో మహిళా ఉద్యోగులు పెరుగుతున్న సందర్భంగా వారికి కావలసిన అన్ని ఏర్పాట్లను సంస్థ చేస్తుందని అన్నారు. సంస్థలో చేరిన మహిళలకు ఈపీ ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని.. దానిని మహిళా కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ రాజేశ్వర్‌రెడ్డి, కార్పొరేట్ జీఎంలు మనోహర్, రఘునాథరెడ్డి, ఎస్‌వోటు జీఎం కవీంద్ర, అధికారులు వెంకటరామరెడ్డి, వెంకటరమణ, జాకీర్‌హుస్సేన్, గుర్తింపు, పాతినిధ్య సంఘాల నాయకులు కొరిమి రాజ్‌కుమార్, రాజేందర్, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
అలసత్వం వీడితేనే అభివృద్ధి
సమస్యలు తెలుసుకునేందుకు
కార్మిక చైతన్య యాత్ర
సింగరేణి సీఎండీ బలరాం
Comments
Please login to add a commentAdd a comment