డీసీసీబీ, ‘పాక్స్’ల పదవీకాలం పొడిగింపు
సాక్షిప్రతినిధి, వరంగల్ : రాష్ట్రంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పాక్స్) పాలకవర్గాల పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. మరో ఆరు నెలల పాటు పదవిలో కొనసాగే విధంగా శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గం గడువు శుక్రవారంతో ముగియగా.. అదే రోజున మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటికే పదవీకాలం ముగిసిన గ్రామ పంచాయతీలు, ఎంపీపీ, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారులను నియమించిన విషయం తెలిసిందే. సహకార సంఘాలకు కూడా ప్రత్యేక అధికారుల నియామకం ఇబ్బందికరం కాగా.. పాలకవర్గాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ‘పాక్స్’ల పదవీకాలం ఆరు నెలలు పొడిగించినట్లు చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల ద్వారా ఉమ్మడి వరంగల్‌లో 91 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు పాలకవర్గాలు మరో ఆరు నెలలు సేవలు అందించనున్నాయి. ఇదిలా ఉండగా.. సహకార సంఘాల పదవీ కాలం పొడిగించినందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, కొండా సురేఖలకు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రజా ప్రభుత్వంలో సహకార సంఘాలకు అందిస్తున్న సహాయ సహకారాలకు ధన్యవాదాలని, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ సంఘాల బలోపేతానికి రాబోయే రోజుల్లో మరింత కృషి చేస్తామని ఆయన తెలిపారు.
మరో ఆరు నెలలు కొనసాగే అవకాశం
ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment